పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్, టీమిండియా ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీని ఎప్పుడైనా పోల్చి చూశారా..? మనమైతే కచ్చితంగా కోహ్లీ కెప్టెన్సీకే ఓటు వేస్తాం. సర్ఫరాజ్‌ను కనీసం కోహ్లీ దరిదాపుల్లో కూడా ఊహించం. కానీ సౌత్‌ఆఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డూ ప్లెసిస్ మాత్రం వీళ్లిద్దరి కెప్టెన్సీ ఒకటేనని చెబుతున్నాడు. వినడానికి కొంత వింతగా ఉన్నా.. ఫాఫ్ మాత్రం ఇది నిజమని అంటున్నాడు. జట్టును ముందుండి నడిపించడంలో పాక్ మాజీ సారథి సర్ఫరాజ్ అహ్మద్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్టైల్ ఒకేలా ఉంటుందంటున్నాడు. అయితే టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని మాత్రం వీళ్లిదరి కంటే డిఫరెంట్‌గా ఉంటుందని అన్నాడు.
‘కోహ్లీ మైదానంలో దూకుడుగా ఉంటాడు. ప్రతి ఒక్క ఆటగాడితో క్రమం తప్పకుండా మాట్లాడి వాళ్ల అభిప్రాయాలు తెలుసుకుంటాడు. ముఖ్యంగా బౌలర్లతో ప్రతి బంతికి ముందు, తర్వాత సంభాషిస్తాడు. సరిగ్గా సర్ఫరాజ్ కూడా ఇలానే చేస్తాడు. మైదానంలో సర్ఫరాజ్ చాలా దూకుడుగా ఉంటాడు. అందరితో మాట్లాడుతూ.. సలహాలిస్తూ సూచనలు తీసుకుంటూ ఉంటాడు. అయితే ఈ విషయంలో ధోనీ స్టైలే వేరు. మైదానంలో కూల్‌గా, రిజర్వ్‌డ్‌గా ఉండే ధోనీ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడంలో దిట్ట. ఆ విషయంలో మాత్రం ధోనీ తరవాతే ఎవరైనా’ అని డు ప్లెసిస్ చెప్పుకొచ్చాడు.
కాగా.. జూన్ 9 నుంచి ప్రారంభంకానున్న పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో పాల్గొనేందుకు పాక్ చేరుకున్న డుప్లెసిస్.. శనివారం పాక్ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు. పీఎస్‌ఎల్‌లో సర్ఫరాజ్ సారథ్యంలోని క్వెట్టా గ్లాడియేటర్స్ తరఫున ఆడుతున్న డుప్లెసిస్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ధోనీ కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆడుతున్న విషయం తెలిసిందే.
ఐపీఎల్ 14వ సీజన్‌లో సీఎస్‌కే తరఫున ఆడిన ఫాఫ్.. 7 మ్యాచ్‌ల్లో 320 పరుగులు చేశాడు. ఇందులో 4 అర్ధసెంచరీలు ఉన్నాయి. అయితే భారత్‌లో కరోనా కేసులు అధికమవడం కారణంగా ఐపీఎల్ అర్ధాంతరంగా రద్దు కావడంతో మిగిలిన మ్యాచ్‌లను సెప్టెంబరు తరువాత యూఏఈలో నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది. దీనికోసం అవసరమైన ఏర్పాట్లు కూడా చేసుకుంటోంది.