చిత్తూరు: కృష్ణపట్నం ఆనందయ్య మందు పంపిణీకి అంతా సిద్ధమైంది. దానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తిరుపతిలోని నారాయణ గార్డెన్స్‌లో ఆనందయ్య మందు తయారీకి అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తవుతున్నాయి. ఆనందయ్య కుమారుడు శ్రీధర్ ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆనందయ్య మందు తయారీ ప్రక్రియను ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి దగ్గరుండి పరిశీలించనున్నారు. అయితే ఆనందయ్య తయారు చేసే మందు చంద్రగిరి నియోజకవర్గ ప్రజల కోసమేనని ఎమ్మెల్యే చెవిరెడ్డి స్పష్టం చేశారు.
ఇటీవలే ఏపీ ప్రభుత్వం కూడా ఆనందయ్య కరోనా మందుకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. మొదట మందును వ్యతిరేకించి కోర్టులో కేసు వేసినప్పటికీ.. ఆ తరువాత ప్రభుత్వం దిగొచ్చింది. ఈ మందుకు రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేసుకునేందుకు అనుమతినిచ్చింది. అయితే ఆనందయ్య మందు వాడినప్పటికీ.. వైద్యులు సూచించే మందులు కూడా వినియోగించాలని, వాటిని అశ్రద్ధ చేయవద్దని తెలిపింది.
ఈ సందర్భంగా ఆనందయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు తొలి విడతగా కరోనా మహమ్మారి బారిన పడిన 5 వేల మందికి మందు పంపిణీ చేస్తానని ఔషధాన్ని తయారు చేసిన నిపుణుడు ఆనందయ్య పేర్కొన్నారు. దీనికి అవసరమైన అన్ని మూలికలను కూడా సమకూర్చుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఔషధ తయారీ ప్రక్రియను ప్రారంభించినట్లు వెల్లడించారు.