న్యూఢిల్లీ: మెడిటేషన్ అండ్ యోగా సైన్సెస్‌లో ఏడాది డిప్లమో కోర్సు ఢిల్లీలో ప్రారంభమైంది. ధ్యానం, యోగ(మెడిటేషన్ అండ్ యోగా సైన్సెస్)పై డిప్లమో కోర్సును ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ప్రారంభించారు. ఇందులో 450 మందికి శిక్షణ ఇవ్వనున్నట్టు సీఎం తెలిపారు. శిక్షణ పొందిన ఇన్‌స్ట్రక్టర్లు అక్టోబర్ 1 నుంచి ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో ఉచితంగా యోగా క్లాసులు నిర్వహిస్తారని తెలిపారు.
ఈ విషయాన్ని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇటీవల ప్రకటించారు. ఈ డిప్లమో కోర్సు కేజ్రీవాల్ విజన్ అని సిసోడియా వెల్లడించారు. యోగాను ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్ది, ఇంటింటికి యోగాను చేరువ చేయాలనేది సీఎం సంకల్పమని అన్నారు. రోజువారీ జీవితంలో యోగాను భాగం చేయనున్నట్టు 2021 బడ్జెట్‌లో ప్రకటించామని, అందుకు అనుగుణంగానే యోగాపై ఏడాది డిప్లమో కోర్సును తెస్తున్నట్టు చెప్పారు.
పాఠశాల విద్య నుంచి బయటకు వచ్చిన తర్వాత 12వ తరగతిలో ఎవరైనా సరే ఈ కోర్సును ఎంచుకోవచ్చని అన్నారు. డీపీఎస్ఆర్‌యూలో ప్రధాన కేంద్రం ఉంటుందని, సిటీ స్కూళ్లలో శాటిలైట్ సెంటర్లు ఏర్పాటు చేసి, ఈవెనింగ్ సెషన్లు నిర్వహిస్తారని, వారంలో మూడు రోజులు రెండు గంటల చొప్పున ఈ సెషన్లు ఉంటాయన్నారు. డిప్లమో ప్రోగ్రామ్ పూర్తి చేసుకున్న విద్యార్థులు ప్రొఫెషనల్ యోగా టీచర్లుగా యోగా చెప్పగలుగుతారని పేర్కొన్నారు.