క్రికెట్లో పాకిస్తాన్-ఇండియా అంటే చిరకాల ప్రత్యర్థులనే తెలుసు. మైదానంలో ఇరు జట్లూ పోటీ పడుతున్నాయంటే ఇది అదో మినీ రణరంగంలా ఉంటుంది. అభిమానులు కూడా అది క్రికెట్ మ్యాచ్‌లా కాకుండా.. యుద్ధంలా ఫీల్ అవుతారు. ఇరు జట్ల ఆటగాళ్లలో కూడా కొందరు అలానే ఉన్నా.. మరికొందరు మాత్రం మైదానం బయట చాలా స్నేహంగా ఉంటారు. ఇక ఇటీవల కొంతమంది పాక్ క్రికెటర్లయితే భారత క్రికెటర్లను ప్రశంసిస్తూ, వారి ఆటతీరును సైతం అభినందిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ చేరాడు.
ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌లో టీమిండియా ఓడినప్పటికీ.. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ గొప్ప కెప్టెనేనని, అందులో ఎలాంటి సందేహం లేదని అక్మల్ అన్నాడు. ఎంస్ ధోనీ తర్వాత విరాట్ కోహ్లీనే అత్యుత్తమ కెప్టెన్ అని కమ్రాన్ అక్మల్ ప్రశంసించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అతడికి 70 సెంచరీలు ఉన్నాయన్నాడు. చాంపియన్స్ ట్రోఫీ, ప్రపంచకప్‌లలో భారత్ ఓడిపోవడం వెనక అతడి తప్పేమీ లేదని తేల్చి చెప్పాడు. ఇండియా గత ఐదేళ్లుగా టెస్టుల్లో నంబర్ వన్‌గా ఉందని గుర్తు చేశాడు. కోహ్లీ సాధించిన విజయాలు, సేవలను ఒకసారి గుర్తు చేసుకోవాలని సూచించాడు. అతడి కెప్టెన్సీ అద్భుతంగా ఉంటుందని, ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదని పేర్కొన్నాడు. అతడో గొప్ప ఆటగాడని ప్రశంసలు కురిపించాడు.
అంతేకాకుండా.. 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2019 ప్రపంచకప్ సెమీ ఫైనల్‌లో ఇండియా ఓటమికి కోహ్లీ కానీ, అతడి కెప్టెన్సీ కానీ ఎంతమాత్రం కారణం కాదని వెనకేసుకొచ్చాడు. కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పిస్తే భారత జట్టు ఐసీసీ టోర్నీలు గెలుస్తుందన్న నమ్మకం తనకు లేదన్నాడు. అయితే క్రికెట్ గురించి ఏ మాత్రం అవగాహన లేనివాళ్లే ఆ పని చేస్తుంటారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. గల్లీ జట్టును కూడా నడిపించలేని వారు కోహ్లీ కెప్టెన్సీ పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తుండడం శోచనీయమని అక్మల్ పేర్కొన్నాడు.
ఇదిలా ఉంటే డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి తరువాత విరాట్ కోహ్లీపై, అతడి కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు మొదలయ్యాయి. టీమిండియా మాజీలతో పాటు ఇతర దేశాల మాజీ క్రికెటర్లు కూడా విరాట్ కెప్టెన్సీని, అతడి ఆటతీరును, ఆలోచనా తీరును విమర్శించడం ప్రారంభించారు. ఇలాంటి సమయంలో పాక్ క్రికెటర్ కమ్రాన్.. విరాట్‌ను వెనకేసుకు రావడం విశేషంగా మారింది.