ఐపీఎల్ 14వ సీజన్ అర్థాంతరంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. అత్యంత కట్టుదిట్టమైన బయోబబుల్ వాతావరణంలో టోర్నీ నిర్వహిస్తున్నప్పటికీ కొందరు ఆటగాళ్లు అనూహ్యాంగా కరోనా బారిన పడడంతో వాయిదా వేయక తప్పలేదు. ఈ క్రమంలోనే టోర్నీని నిలిపివేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. దీంతో విదేశీ ఆటగాళ్లంతా వారి వారి దేశాలకు వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే కొంతమంది ఐపీఎల్ అనుభవాలను పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ కూడా ఇన్‌స్టాలో తన ఐపీఎల్ అనుభవాలను వెల్లడించాడు. అయితే అందరిలా కాకుండా ముస్తాఫిజుర్ ఐపీఎల్‌ను నరకంతో పోల్చాడు. ఐపీఎల్‌లో బయోబబుల్ వాతావరణంలో ఉండడం తనకు నరకంలా అనిపించిందని సంచలన కామెంట్స్ చేశాడు. కొన్ని నెలలుగా బమోబబుల్‌లో ఉంటూ మ్యాచ్‌లు ఆడడంతో మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురయ్యానని ముస్తాఫిజుర్ చెప్పుకొచ్చాడు.
ఇక టోర్నీ రద్దుకు ముందు తమ జట్టు ఆటగాళ్లు కూడా కరోనా బారిన పడ్డారని, దాంతో తాను కూడా ఐసోలేషన్లో ఉండాల్సి వచ్చిందని, 5 నుంచి 6 రోజుల పాటు ఒకే రూంలో ఉండడం నరకంలా అనిపించిందని అన్నాడు. కానీ టోర్నీ ముగిసిన తరువాత ఇంటికి చేరుకోవడంతో కొత్త ఊపిరి వచ్చినట్లుందని అన్నాడు. తనకు క్షేమంగా ఇంటికి పంపినందుకు తమ జట్టు రాజస్థాన్‌కు కృతజ్ఞతలు చెప్పాడు.
”ఇంటికి తిరిగివచ్చినందుకు సంతోషంగా ఉంది. గత కొన్ని నెలలుగా బయోబబుల్‌లో ఉండడం ఇబ్బందిగా అనిపించింది. మమ్మల్ని ఇంటికి క్షేమంగా పంపించినందుకు రాజస్తాన్ రాయల్స్‌కు మనస్పూర్తిగా కృతజ్ఞతలు. అయితే టోర్నీ మధ్యలో ఆటగాళ్లకు కరోనా సోకడంతో మమ్మల్ని ఐదు నుంచి ఆరు రోజుల పాటు ఒకే రూంలో ఉంచారు. ఆ సమయంలో మాత్రం నాకు నరకంగా అనిపించింది. ఇప్పుడు ఇంటికి చేరడంతో కాస్త ప్రశాంతంగా ఉంది. కొన్నిరోజుల పాటు క్రికెట్‌కు విరామమిచ్చి కుటుంబసభ్యులతో ఆనందంగా గడపాలని నిర్ణయించుకున్నా” అని పేర్కొన్నాడు.
ఇదిలా ఉంటే న్యూజిల్యాండ్‌తో సిరీస్ అనంతరం ఐపీఎల్ కోసం ముస్తాఫిజుర్ ఇండియా చేరుకున్నాడు. అప్పటి నుంచి బయోబబుల్‌లోనే ఉన్నాడు. కాగా.. ఈ సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్ తరపున ప్రాతినిధ్యం వహించి 8 మ్యాచ్‌ల్లో 7 వికెట్లు తీశాడు. కాగా ఐపీఎల్ 2021కి కరోనా మహమ్మారి సెగ తగలడంతో సీజన్‌ను రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. దీంతో ఫ్రాంచైజీలన్నీ తమ జట్టులోని విదేశీ ఆటగాళ్లను చార్టర్డ్ ఫ్లైట్‌ల ద్వారా వారి దేశాలు పంపారు. అందులో భాగంగానే ముస్తాఫిజుర్ కూడా రాజస్థాన్ రాయల్స్ ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫ్లైట్‌లో బంగ్లాదేశ్‌కు చేరుకున్నాడు. అతడితో పాటు సహచర ఆటగాడు.. ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ కూడా స్వదేశానికి వెళ్లి హోం ఐసోలేషన్లో ఉన్నాడు.