ఐపీఎల్ 14వ సీజన్‌లో సీఎస్‌కే మరో విజయాన్ని నమోదు చేసింది. పటిష్ఠ రాయల్ చాలెంజర్స్ బెంగళూరును మట్టి కరిపించింది. ఈ సీజన్లోనే మరే జట్టూ సాధించనంత తేడాతో ఘన విజయం సాధించింది. చెన్నై విజయంలో రవీంద్ర జడేజా ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. అటు బ్యాటింగ్‌లో అజేయ అర్థ సెంచరీతో రాణించడంతో పాటు.. బౌలింగ్‌లో కూడా 3 వికెట్లు తీసి అదరగొట్టాడు. జడేజా సూపర్ షోతో చెన్నై సునాయాసంగా విజయం సాధించింది. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకి డుప్లెసిస్(50) అర్థ సెంచరీతో అదిరిపోయే ఓపెనింగ్ ఇచ్చాడు. దానికి తోడు చివర్లో జడేజా మెరుపు ఇన్నింగ్స్ కూడా తోడవ్వడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఏకంగా 191 పరుగుల స్కోరు చేసింది.
అనంతరం 192 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 122 పరుగులు మాత్రమే చేయగలిగింది. దేవదత్ పడిక్కల్(34) మంచి ఆరంభాన్ని ఇచ్చినా.. కెప్టెన్ కోహ్లీ(8) పరుగులకే అవుట్ కావడంతో జట్టుపై ఒత్తిడి పెరిగింది. ఆ తర్వాతి ఓవర్లోనే అప్పటివరకు బౌండరీలతో విరుచుకుపడుతున్న దేవ్‌దత్ పడిక్కల్(34: 15 బంతుల్లో.. 4 ఫోర్లు, 2 సిక్స్‌లు)ను శార్దూల్ ఠాకూర్ అవుట్ చేయడంతో ఆర్సీబీ పరుగుల వేగానికి గండి పడింది. ఇక వాషింగ్టన్ సుందర్(7: 11 బంతుల్లో.. 1 ఫోర్) మరోసారి నిరాశపరిచాడు. అలాగే ఇప్పటివరకు ఆర్సీబీ విజయాలలో కీలక పాత్ర పోషించిన మ్యాక్సీ, ఏబీడీలను జడేజా వరుస ఓవర్లలో పెవిలియన్‌కు చేర్చాడు. 22 పరుగుల వద్ద మ్యాక్స్‌వెల్‌ను, 4 పరుగుల వద్ద ఏబీ డివిలియర్స్‌ను వరుస ఓవర్లలో క్లీన్ బౌల్డ్ చేసి ఆర్సీబీ గెలుపు ఆశలను నాశనం చేశాడు.
ఇక అక్కడి నుంచి ఆర్సీబీ ఓటమి ఖరారైంది. మిగతా బ్యాట్స్‌మెన్ అంతా సీఎస్‌కే బౌలర్ల ధాటికి నిలవలేకపోయారు. అంతా అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆర్సీబీ 9 వికెట్లు కోల్పోయి కేవలం 122 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఏకంగా 69 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. సీఎస్‌కే బౌలర్లలో జడేజా 3, తాహిర్ 2 వికెట్లు తీయగా.. శార్దూల్, శామ్ కర్రాన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఈ విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌కు చేరింది. ఆర్సీబీ రెండో స్థానానికి పడిపోయింది. ఇరు జట్లూ 5 మ్యాచ్‌లలో నాలుగే గెలిచినా.. రన్ రేట్ ఆధారంగా సీఎస్‌కే మొదటి స్థానానికి చేరింది.