కోహ్లీకి సూర్యకుమార్ యాదవ్ అంటే కోపమా..? అతడిని కావాలనే జట్టులోకి రాకుండా అడ్డుకుంటున్నాడా..? అలాగే కేఎల్ రాహుల్‌పై అభిమానంతోనే అతడు ఎన్నిసార్లు ఫెయిల్ అయినా జట్టులోకి తీసుకుంటూ మరిన్ని అవకాశాలిస్తున్నాడా..? ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఇదే చర్చ జరుగుతోంది. మూడో టీ20లో సూర్యకుమార్ యాదవ్‌కు జట్టులో చోటు లేకపోవడం, మొదటి రెండు టీ20ల్లో పూర్తిగా విఫలమైనా రాహుల్‌కు మళ్లీ జట్టులో చోటు దక్కడం.. ఈ పరిణామాల కారణంగానే కోహ్లీ కెప్టెన్సీపై అనేకమంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రెండు టీ20ల్లో దారుణ ప్రదర్శన చేసినా మూడో టీ20లో కూడా రాహుల్‌కు స్థానం లభించింది. కానీ చాలా కాలం తరువాత జట్టులోకొచ్చిన ధవన్‌ను రెండో టీ20లోనే తొలగించేశారు. కెప్టెన్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి ధవన్‌ను పక్కన కూర్చోబెట్టి రాహుల్‌ను మాత్రం కొనసాగించారు. రెండో టీ20లో అరంగేట్ర ఆటగాడు ఇషాన్ కిషన్ సూపర్ షోతో టీమిండియా గెలిచింది. కానీ రాహుల్ మాత్రం డకౌట్ అయ్యాడు. తొలి రెండు మ్యాచ్‌లలో లేని రోహిత్ జట్టులోకి వచ్చినా.. రాహుల్‌ను మాత్రం జట్టులో నుంచి తొలగించలేదు. మొత్తం ముగ్గురు ఓపెనర్లతో బరిలోకి దిగారు. కానీ ఈ సారి కూడా రాహుల్ ఆటతీరులో మార్పు రాలేదు. ఈ సారి కూడా డకౌట్‌గానే వెనుతిరిగాడు.
కానీ సూర్యకుమార్ యాదవ్ విషయంలో మాత్రం కోహ్లీ వేరుగా ప్రవర్తించాడు. ఐపీఎల్, విజయ్ హజారే ట్రోఫీల్లో అద్భుత ప్రదర్శన కనబరిచినా.. సూర్యకుమార్ యాదవ్‌కు జట్టులో చోటు దక్కలేదు. ఎట్టకేలకు జాతీయ జట్టులో అవకాశం దక్కినా.. తొలి టీ20లో తుది జట్టులోకి తీసుకోలేదు. రెండో టీ20లో తీసుకున్నా.. బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. అయినప్పటికీ మూడో టీ20లో రోహిత్ శర్మ జట్టులోకి రావడంతో అతడిని మళ్లీ రిజర్వ్ బెంచ్‌కే పరిమితం చేశారు. అయితే తొలి రెండు టీ20ల్లో పేలవ ప్రదర్శనతో దారుణంగా విఫలమైన ఓపెనర్ రాహుల్‌ను పక్కన పెట్టడానికి బదులు.. మిడిలార్డర్‌లో జట్టుకు బలంగా మారగలిగే స్కైను తొలగించడంపైనే అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోహ్లీ కావాలనే స్కైపై పగ తీర్చుకుంటున్నాడని వారు విమర్శిస్తున్నారు. ‘కనీసం అతడెలా ఆడుతున్నాడో కూడా తెలియకుండా ఎలా పక్కన కూర్చోబెడతావ్..?’ అంటూ మండిపడుతున్నారు.
గతేడాది ఐపీఎల్‌లో ముంబై, బెంగళూరు మధ్య జరిగిన ఓ మ్యాచ్‌లో స్కై పరుగుల వరద పారిస్తుండడంతో కోహ్లీ అతడి వద్దకు వచ్చి స్లెడ్జింగ్ చేశాడు. దీనికి స్కై కూడా అదే తరహాలో సమాధానమిచ్చాడు. ఇక ఆ మ్యాచ్‌లో ముంబై జట్టును స్కై గెలిపించాడు. మ్యాచ్ ముగిసిన తరువాత మైదానంలో నిలబడే.. ‘నేనున్నాగా.. టెన్షన్ అవసరం లేదు’ అన్నట్లు డ్రెస్సింగ్ రూం వైపు తిరిగి సైగ చేశాడు. ఈ మ్యాచ్ నుంచి కోహ్లీకి, స్కైకి మధ్య సంబంధాలు సరిగా లేవని, అందుకే అతడిని జట్టులోకి తీసుకోవడం లేదని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది.