పంజాబ్ కింగ్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ 4 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. పంజాబ్ నిర్ధేశించిన 222 పరుగుల టార్గెట్‌కు అతి దగ్గరగా వచ్చి పరాజయం పాలైంది. 20వ ఓవర్ ఆఖరి బంతికి ఫోర్ కొడితే కనీసం మ్యాచ్ టై అయ్యే అవకాశం ఉన్నా.. సంజూ.. మోరిస్‌కు స్ట్రైకింగ్ ఇవ్వలేదు. చివరి బంతికి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి బౌండరీ వద్ద హుడాకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దాంతో రాజస్థాన్‌కు ఓటమి తప్పలేదు. తాను సెట్ అయిన బ్యాట్స్‌మన్ కావడంతో అవతలి ఎండ్‌లో ఉన్న మోరిస్‌కు సంజూ బ్యాటింగ్ ఇవ్వలేదు. బ్యాటింగ్ ఎండ్ వరకు పరిగెత్తుకొచ్చినప్పటికీ మోరిస్‌ను వెనక్కి పంపించేశాడు. దీంతో మోరిస్ కూడా ఆశ్చర్యం, అసహనం వ్యక్తం చేశాడు.
మరి తనపై కెప్టెన్‌కు నమ్మకం లేకపోవడం నచ్చలేదో ఏమో.. ఢిల్లీతో మ్యాచ్‌లో మోరిస్ చెలరేగి ఆడాడు. 18 బంతుల్లో 4 సిక్సర్లతో 36 పరుగులు సాధించి రాజస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించి హీరో అయ్యాడు. క్రీజ్‌లో వచ్చీ రావడంతోనే భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. మోరిస్ బ్యాటింగ్ చేస్తుంటే రాజస్థాన్ రాయల్స్ శిబిరం ఆనందంతో రెచ్చిపోయింది. ఈ స్ట్రైకింగ్‌తో తానేంటో కెప్టెన్ సంజూకు నిరూపించుకున్నాడు.
ఈ క్రమంలోనే మ్యాచ్ అనంతరం సంజూ శాంసన్ మాట్లాడుతూ.. మోరిస్ అద్భుతంగా ఆడాడని కొనియాడాడు. ఇప్పుడు మోరిస్ బ్యాటింగ్ చూసిన తర్వాత తొలి మ్యాచ్‌లో సింగల్ తీయకపోవడం తప్పని భావిస్తున్నావా..? అంటూ కామెంటేటర్ అడగా.. ‘కచ్చితంగా.. మళ్లీ తనకు ఆ మ్యాచ్ ఆడే అవకాశం వస్తే ఈ సారి తప్పకుండా సింగిల్ తీస్తాన’ని సంజూ చెప్పాడు.
కాగా.. ఐపీఎల్ 2021లో భాగంగా గురువారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఉత్కంఠ విజయం సాధించిన విషయం తెలిసిందే. డేవిడ్ మిల్లర్, క్రిస్ మోరిస్ అద్భుత ప్రదర్శనతో ఓటమి అంచుల నుంచి గట్టెక్కి ఎలాగోలా విజయం సాధించింది. మ్యాచ్ రాజస్థాన్ చేతుల్లో నుంచి చేజారిందనుకున్న సమయంలో మిల్లర్ అద్భుంతంగా పోరాడి జట్టును విజయం వైపు నడిపించాడు. అయితే అతడు కూడా అవుట్ కావడంతో రాజస్థాన్‌కు ఓటమి తప్పదని అంతా అనుకున్నారు. కానీ చివర్లో బౌలింగ్ ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్ అద్భుత బ్యాటింగ్‌తో తమ జట్టుకు విజయాన్ని కట్టబెట్టాడు.