కరోనాను ఎలా అంతం చేయాలా..? అని దాదాపు ఏడాదిన్నరగా అనేకమంది శాస్త్రేవత్తలు తెగ మల్లగుల్లాలు పడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కోట్లమంది ప్రాణాలను తీసిన ఈ మహమ్మారి వైరస్ నుంచి మానవాళిని రక్షించేందుకు అన్నిరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తాజాగా యూనివర్శిటీ ఆఫ్ గ్లాస్‌గోవ్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఓ సరికొత్త అధ్యయనం చేశారు. దాని ఆధారంగా ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. అదేంటంటే.. జలుబుతో కరోనాకు చెక్ పెట్టొచ్చట. నమ్మడానికి కొంత ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమని సైంటిస్టులు బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. జలుబుకు కారణమయ్యే రైనో వైరస్‌కు, ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌కు మధ్య ఓ పోటీ పెట్టారు. అందులో ఆశ్చర్యంగా రైనో వైరస్ విజేతగా నిలిచింది. కరోనా వైరస్‌ను అంతం చేసింది. ఈ అధ్యయనం ప్రకారమే శాస్త్రవేత్తలు తాజా ఫలితాన్ని సాధించారు.
శ్వాసకోస కణజాలాన్ని సిద్ధం చేసి.. దానిపై జలుబుకు కారణమైన రైనో వైరస్‌ను, కరోనా వైరస్‌ను వదిలారు. అయితే కరోనా కంటే ముందే రైనో వైరస్ ఆ కణజాలాన్ని ఆక్రమించేసింది. కరోనాకు చోటు లేకుండా చేసింది. అయితే శాస్త్రవేత్తలు మరో ఇదే ప్రయోగాన్ని చేసి.. అందులో శ్వాసకోస కణజాలంపై ముందుగా కరోనా వైరస్‌ను వదిలారు. దాదాపు 24 గంటల తరువాత జలుబు వైరస్‌ను వదిలారు. అయితే 24 గంటల ముందుగా కరోనా స్థావరం ఏర్పాటైనప్పటికీ.. జలుబు వైరస్ చేరుకోగానే కరోనాను తరిమేసింది. దీంతో రైనో వైరస్ ధాటికి కరోనా వైరస్ తట్టుకోలేదని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు.
ఈ ప్రయోగంపై శాస్త్రవేత్తలు మాట్లాడుతూ.. రైనో వైరస్ శరీరంలోకి ప్రవేశించగానే రోగనిరోధక శక్తి పనిచేయడం ప్రారంభమవుతుందని, దీంతో కణజాలంలో కరోనా వైరస్ బతకలేని పరిస్థితులు ఏర్పడతాయని చెప్పారు. అయితే రైనో వైరస్ వల్ల శరీరం ఏర్పరచుకున్న రోగ నిరోధక శక్తి తాత్కాలికం కావడంతో దాని ప్రభావం తగ్గగానే మళ్లీ కరోనా వైరస్ విజృంభించే అవకాశం ఉందని, అందువల్ల దీనిని ఎవరూ నిర్లక్ష్యం చేయవద్దని చెబుతున్నారు. కరోనా నిరోధక టీకాలు తీసుకోవడం చాలా మంచిదని, ప్రజలంతా దీనిని తీసుకోవాలని సూచిస్తున్నారు.