టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా ఎంతో క్లాస్‌గా బంతిని డిఫెండ్ చేయగలడు. అంతకంటే గొప్పగా క్లాసికల్ బౌండరీలు బాదగలడు. అయితే పుజారా ఎప్పుడైనా భారీ సిక్సర్లు బాదడం చూశారా..? అది చాలా అరుదు కానీ ఇకపై చూడబోతున్నారు. ప్రతి బంతిని స్టాండ్స్ బయటకు కొడుతూ విధ్వంసం సృష్టించగల పుజారా మీకు కనిపించబోతున్నాడు. అవును.. మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతున్న ఐపీఎల్‌లో మీరో కొత్త పుజారాను చూడబోతున్నారు. ఈ వీడియో చూస్తే నేను చెప్పిన మాట ఎంత నిజమో మీకే అర్థమవుతుంది.
ఏప్రిల్ 9 నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్ 14వ సీజన్ ప్రారంభం కాబోతోంది. ఈ టోర్నీ కోసం ఇటీవల జరిగిన మినీ వేలంలో పుజారాను చెన్నై కనీస ధర రూ.50లక్షలు చెల్లించి దక్కించుకుంది. పుజారా తన ఓవరాల్ ఐపీఎల్ కెరీర్‌లో మొత్తం 30 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. వాటిలో 99.74 స్ట్రయిక్ రేట్‌తో 390 పరుగులు సాధించాడు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ కూడా ఉంది. అయితే ఈ ఏడాది ఎలాగైనా తనపై ఉన్న టెస్ట్ క్రికెటర్ ముద్రను తొలగించుకునేందుకు తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నాడు. అందుకోసం ఇతర ఆటగాళ్లతో కలిసి నెట్స్‌లో కఠోర సాధన చేస్తున్నాడు.
టీమిండియా తరఫున 85 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన పుజారా ఒక్క అంతర్జాతీయ టీ20 కూడా ఆడకపోవడం విశేషం. అయితే పుజారా రీఎంట్రీ మ్యాచ్ ముంబై వేదికగా ఏప్రిల్ 10న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్ అందరికంటే ముందే ప్రాక్టీస్ సెషన్స్ మొదలు పెట్టేసింది. ఈ సెషన్స్‌లో తాజాగా చతేశ్వర్ పుజారా పాల్గొన్నాడు. కానీ ఎప్పుడూ నెమ్మదిగా ఆడే పుజారా ఐపీఎల్ కోసం భారీ షాట్లు ప్రాక్టీస్ చేస్తున్నాడు. ప్రాక్టీస్ సెషన్‌లో బౌలర్లను ఉతికి ఆరేస్తున్నాడు. ముఖ్యంగా స్పిన్ బౌలర్లను భారీ షాట్లతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. నెట్స్‌లో అతను భారీ షాట్లు ఆడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
IPL 2021: Pujara smashes sixes in CSK nets with new batting stance
Video: Chennai Super kings #pujara #CSK #Dhoni pic.twitter.com/Ps6cXrqz7I— NF REPORTS (@ReportsNf) March 31, 2021
పుజారా సిక్సర్లతో విరుచుకుపడుతున్న వీడియో చూసిన నెటిజన్లు అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘పుజారా ఆన్ ఫైర్’ అంటూ అభిమానులు ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. చాలా కాలంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌కు దూరంగా ఉన్న పుజారా.. ఎన్నో ఏళ్ల తరువాత మళ్లీ ఈ ఏడాది ఐపీఎల్‌తో పొట్టి క్రికెట్‌లోకి అడుగుపెట్టబోతున్నాడు. దీంతో అభిమానులతందరి కళ్లూ అతడిపైనే ఉన్నాయి. టీ20 క్రికెట్ పుజారా ఎలా ఆడుతాడోనంటూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో పుజ్జీ భాయ్ భారీ షాట్లతో విరుచుకుపడటం అభిమానులను అంతులేని ఆనందాన్ని కలిగిస్తోంది. పుజారా ఆఖరిసారి 2014లో ఐపీఎల్ ఆడాడు. ఆ తర్వాత పుజారా ఐపీఎల్‌కు పూర్తిగా దూరమై టెస్టులకు మాత్రమే పరిమితమయ్యాడు. అయితే మళ్లీ ఇన్నేళ్ల తరువాత ఈ క్యాష్ రిచ్‌లీగ్ బరిలోకి దిగనున్నాడు.