ప్రస్తుతం కరోనా తెలుగురాష్ట్రాలలో ఏ విధంగా ప్రభలుతుందో తెలియంది కాదు. జనమంతా ఈ మూడక్షరాల జపమే చేస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితులు తిరిగి ఎప్పటికీ చక్కబడతాయో తెలియదు కానీ.. ప్రపంచం మొత్తం భయాందోళనలో ఉందన్నది మాత్రం నిజం. మళ్లీ కరోనా మొదలైన రోజులు వచ్చేస్తున్నాయి. లాక్‌డౌన్ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలు కరోనా కారణంగా రాత్రిపూట కర్ఫ్యూలు విధించాయి. ఆర్థిక వ్యవస్థ మళ్లీ కుంటుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ జనజీవనం స్థంభిస్తోంది. ఇక సినీ పరిశ్రమ కూడా మళ్లీ లాక్‌డౌన్‌కి గురయిన చందంగా మారింది. థియేటర్లు లేవు. షూటింగ్స్ ఆగిపోయాయి. విడుదలకు రెడీ అయిన సినిమాలు కూడా ఇప్పుడు విడుదలకు నోచుకోలేని పరిస్థితిని ఫేస్ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ‘పటారుపాళెం’ చిత్రాన్ని కూడా వాయిదా వేస్తున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. ఏప్రిల్ 23న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కరోనా ఉధృతి తీవ్రరూపం దాల్చడంతో.. చేసేది లేక.. చిత్ర విడుదలను వాయిదా వేస్తున్నామని, పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత విడుదల తేదీని ప్రకటిస్తామని మేకర్స్ ప్రకటించారు.
జె.ఎస్. ఫిలిమ్స్ పతాకంపై దొరైరాజు వూపాటి స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పటారుపాళెం’. శ్రీ మానస్, సమ్మోహన హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ప్రేమిస్తే, ఉప్పెన తరహాలోనే మంచి ప్రేమకథగా.. పరువు హత్యల నేపథ్యంలో, కొన్ని యధార్థ సంఘటనలను ఆధారం చేసుకొని తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. కానీ కరోనా కారణంగా థియేటర్లు మూసివేయడంతో.. చిత్ర విడుదలను పోస్ట్ పోన్ చేశారు. వి. లతా రెడ్డి, వి. సౌజన్యా దొరైరాజు, బి.ఆర్. బాబు, కె. రామకృష్ణ ప్రసాద్‌లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి ఆర్.కె. ములింటి సినిమాటోగ్రఫీ అందించారు.