క్రికెట్‌కు జెంటిల్‌మెన్ గేమ్ అని పేరు. ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మధ్య క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతుంటాయి. ఏ తప్పూ జరగకుండా, ఆటగాళ్లు ఎలాంటి తప్పులూ చేయకుండా ఈ రూల్స్ ఉంటాయి. కానీ కొన్ని సార్లు బహిరంగంగా ఆటగాళ్లు తప్పు చేసినా.. దానికి సరైన శిక్ష ఉండదు. దానికి కారణం ఆ తప్పుకు సంబంధించిన సరైన నిబంధన లేకపోవడమే. తాజాగా ఐపీఎల్‌లో భాగంగా అలాంటి తప్పే ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. వరుసగా అదే తప్పును కొందరు ఆటగాళ్లు చేస్తుండడంతో ఇప్పుడది తీవ్ర చర్చనాయాంశంగా మారింది. బౌలర్ బంతి విడుదల చేయకముందే నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్ రన్ కోసం క్రీజు దాటి ముందుకు రావడం ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది.
పంజాబ్ కింగ్స్ పేసర్ మహ్మద్ షమీ బౌలింగ్ వేస్తున్నప్పుడు.. నాన్ స్టైకింగ్ ఎండ్‌లో ఉన్న ముంబై బ్యాట్స్‌మన్ కీరన్ పొలార్డ్.. బంతి రిలీజ్ కాకముందే క్రీజ్‌ను దాటి ముందుకు వెళ్లిపోయాడు. బౌలర్ వైపు చూస్తూనే ఇలా వెళ్లడంతో ఈ చర్యపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఫోటోలను షేర్ చేస్తూ పొలార్డ్ చేసిన పనిని అనేకమంది నెటిజన్లు తప్పుబడుతున్నారు. ఇలాంటి వారికి 5 పరుగుల పెనాల్టీ విధించాలని కోరుతున్నారు. కామెంటేటర్లు కూడా ఇదే విషయాన్ని చెప్పారని మరికొందరు యూజర్లు కామెంట్లు పెడుతున్నారు.
దీనిపై మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘బౌలర్ క్రీజ్ దాటి బౌలింగ్ వేస్తే నో బాల్ కదా.. బ్యాట్స్‌మన్ ముందే క్రీజ్ దాటితే ఏం చేయాలి..?’ అని ప్రశ్నించాడు. మరికొంతమంది మాజీ బౌలర్లు కూడా ఇదే విషయమై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ మ్యాచ్ మాత్రమే కాకుండా సీఎస్‌కే, రాజస్తాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. ముస్తాఫిజుర్ బౌలింగ్ వేయడానికి ముందే డ్వేన్ బ్రావో క్రీజును దాటేసి ముందుకు వెళ్లిపోయాడు. అప్పుడు కూడా క్రికెట్ అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి.
ఇదిలా ఉంటే 2019 ఐపీఎల్ సీజన్‌లో ఇలానే క్రీజు దాటిన రాజస్తాన్ రాయల్స్ బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్‌ను అప్పటి పంజాబ్ బౌలర్.. రవిచంద్రన్ అశ్విన్ మన్కడింగ్ ద్వారా ఔట్ చేశాడు. అయితే అది పెద్ద తప్పులా అందరూ అతడిని నిందించారు. దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది. అసలు మన్కడింగ్ చేయడం నేరమా..? సమంజసమా..? అనే కోణంలో భారీ చర్చలే జరిగాయి. కానీ ఓ కన్‌క్లూజన్ మాత్రం దొరకలేదు. ఆ తర్వాత మరే బౌలర్ కూడా మన్కడింగ్ చేయలేదు. అంతవరకు బాగానే ఉన్నా.. బ్యాట్స్‌మన్ కూడా జెంటిల్‌మెన్‌లా ఆడడం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.