ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా మంగళవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమితో ఢిల్లీ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి పడిపోయింది. ఆర్సీబీ మళ్లీ టాప్ ప్లేస్‌కు చేరింది. అయితే మ్యాచ్ ఆఖరి బంతికి 6 పరుగులు కావల్సి ఉండగా.. స్ట్రైకింగ్‌లో ఉన్న పంత్ కేవలం 4 మాత్రమే కొట్టగలిగాడు. దీంతో ఒక్క పరుగు తేడాతో ఢిల్లీ ఓటమి చవి చూసింది. సిరాజ్ ఆఫ్‌సైడ్ యార్కర్ వేసిన ఆ బంతిని పంత్ సిక్స్ కొట్టాలని ప్రయత్నించాడు కూడా. కానీ కేవలం ఫోర్ మాత్రమే కొట్టగలిగాడు. దాంతో ఆర్సీబీ నిర్దేశించిన 172 పరుగులు టార్గెట్‌లో ఢిల్లీ 170 పరుగులకే పరిమితమైంది. ఓటమి మూటగట్టుకుంది.
ఇదంతా ఓ ఎత్తయితే.. మ్యాచ్ ముగిసిన తర్వాత పంత్‌తో కోహ్లీ కలిసి మాట్లాడుకుంటున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతేకాదు.. ఆ వీడియోలో సిక్స్ కొట్టాలంటే బ్యాట్ ఎలా ఆడాలి..? ఆఫ్ సైడ్ వచ్చిన బంతిని ఎలా బాదాలి..? అనే విషయాల్లో కోహ్లీ పంత్‌కు మెళకువలు నేర్చుతున్నట్లు కనిపించింది. మరికొంత పైనుంచి హిట్ చేసి ఉంటే అది సిక్స్ వచ్చేదని కోహ్లి సైగలకు అర్థంగా తెలుస్తోంది. దీనికి పంత్ కూడా సమాధానమివ్వడాన్ని ఆ వీడియోలో గమనించవచ్చు. అది ఆఫ్ స్టంప్‌కు పడిందని, అందుకే పైనుంచి కొట్టలేకపోయానని పంత్ చెబుతున్నట్లు ఆ వీడియోలో అర్థమవుతుంది.
ఇలా వీరిద్దరి మధ్య సంభాషణ జరుగుతుండగానే.. అక్కడకి ఆర్సీబీ బౌలర్ సిరాజ్ కూడా వారితో చేరాడు. ఈ ముగ్గురూ ఓ చోట చేరి కొద్ది సేపు సరదాగా మాట్లాడుకున్నారు. జోకులు వేసుకుంటూ నవ్వుకున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా దీనిని తెగ వైరల్ చేస్తున్నారు. కోహ్లీ వద్ద మెళకువలు నేర్చుకోవడం పంత్‌కు బాగా కలిసొస్తుందని, టీమిండియాలో పంత్ బలమైన బ్యాట్స్‌మన్‌గా ఎదగాలంటే కోహ్లీ సలహా, సూచనలు పాటించాల్సిందేనని వారు కామెంట్లు చేస్తున్నారు.