దేశ ప్రధాని మోదీ లెక్క తప్పిందా..? ఆయన అంచనాలను తలకిందులు చేస్తూ రాష్ట్రాల్లోని ప్రజలు ఎన్నికల తీర్పునిచ్చారా..? కొనసాగుతున్న పరిణామాలను చూస్తుంటే అదే నిజం అనిపిస్తోంది. జరుగుతున్నవి అసెంబ్లీ ఎన్నికలే అయినా.. నేటి కష్టకాలంలో దేశ భవిష్యత్తును నిర్ణయించే విధంగా ఈ ఎన్నికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాలతో పాటు యూటీ పుదుచ్చేరి ఐదు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని విశ్లేషకులు అంటున్నారు. ఈ క్రమంలోనే నేడు కౌంటింగ్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. పుదుచ్చేరి, అస్సాంలో తప్ప మిగతా రాష్ట్రాల్లో బీజేపీ పూర్తిగా వెనుకబడి పోయింది. ఈ ఎన్నికల ఫలితాలతో అధికార పీఠం ఏ పార్టీ సొంతం అవుతోందో తేలనుంది.
ప్రధానంగా పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలపై బీజేపీ భారీగా దృష్టి సారించింది. అయితే అనుకున్న స్థాయిలో రాణించలేక పోయింది. ఒక రాష్ట్రంలో అతి తక్కువ సమయంలో అక్కడి ప్రాంతీయ పార్టీని ఓడించి నిలదొక్కుకోవడం చాలా కష్టం. బీజేపీ ఈ ఎన్నికల్లో అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నట్లు అనిపిప్తోంది. దానివల్లే ఓటమి దిశగా అడుగులుపడుతున్నట్లు అంచనాలున్నాయి.
ఇక బెంగాల్ తరువాత అదే స్థాయిలో ప్రాధాన్యం ఉన్న తమిళనాడులో కూడా బీజేపీ కూటమి వెనుకబడిపోయింది. ఈ రాష్ట్రంలో సాధారణంగా ప్రాంతీయతకు ప్రజలు అత్యధిక ప్రాధాన్యతనిస్తారు. ఈ క్రమంలోనే అక్కడ స్టాలిన్ పార్టీ డీఎంకే(ద్రవిడ మున్నేట్ర కళగం) భారీ మెజారిటీ దిశగా దూసుకుపోతోంది. ఇదే సమయంలో అన్నాడీఎంకే పార్టీ భాజాపాతో చేతులు కలపడంతో ప్రజలు ఆ పార్టీని ఆదరించలేదనే వార్తలు వస్తున్నాయి.
ఇక కేరళలో మళ్లీ పినరయ్ విజయన్ కూటమి ఎల్‌డీఎఫ్ అధికారంలోకి వచ్చే దిశగా ముందుకు సాగుతోంది. అయితే అస్సాం రాష్ట్రంలో మాత్రం బీజేపీ అధికారం సాధించే దిశగా దూసుకుపోతోంది. ఇక కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కూడా బీజేపీ ముందంజలో ఉంది. దీంతో మొత్తం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ప్రధాని మోదీ లెక్కలు పూర్తిగా తప్పినట్లు స్పష్టమవుతోంది. దీంతో ఆ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.