ఐపీఎల్ 14వ సీజన్ అర్థాంతరంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. అత్యంత కట్టుదిట్టమైన బయోబబుల్ వాతావరణంలో టోర్నీ నిర్వహిస్తున్నప్పటికీ కొందరు ఆటగాళ్లు అనూహ్యాంగా కరోనా బారిన పడడంతో వాయిదా వేయక తప్పలేదు. దీంతో బీసీసీఐ వేల కోట్లు నష్టపోయింది. ఈ క్రమంలోనే భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మరింత కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగానే రాబోయే ఇంగ్లండ్ పర్యటనకు సంబంధించి ఆటగాళ్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా కరోనా బారిన పడ్డారంటే ఇంగ్లండ్ పర్యటనను మర్చిపోవాల్సిందేనని తేల్చి చెప్పింది.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్, ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌ల కోసం టీమిండియా ఇంగ్లండ్ బయలుదేరనుంది. మరో రెండు వారాల్లో భారత జట్టు ఇంగ్లండ్ వెళ్లనుంది. దీనికోసం ఇప్పటికే 20 మంది ఆటగాళ్లతో బీసీసీఐ జట్టు సభ్యులను కూడా ప్రకటించింది. అంతేకాకుండా మరికొంతమంది కూడా ఫిట్‌నెస్ నిరూపించుకుంటే ఇంగ్లండ్ విమానం ఎక్కే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం దేశంలో ఉన్న కరోనా సెకండ్ వేవ్ దారుణ పరిస్థితుల దృష్ట్యా ఆటగాళ్లలో ఎవరైనా కరోనా బారిన పడితే ఇక వారిని ఇంగ్లండ్ పర్యటనను నుంచి తొలగించనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది.
ప్రస్తుతం ఇళ్లలోనే ఉన్న ఆటగాళ్లంతా ముంబై వచ్చి 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలి. ఈ సమయంలో రెండు సార్లు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తారు. అందులో ఎవరికి పాజిటివ్ వచ్చినా భారత్‌లోనే ఉండిపోవాలని, సిరీస్ మొత్తానికి దూరం కావాల్సి వస్తుందని బీసీసీఐ స్పష్టం చేసిందట. అందుకే ముంబై వచ్చే ముందు జాగ్రత్తగా ఇళ్లలోనే ఉండాలని ఆటగాళ్లకు ఫిజియో యోగేశ్ పామర్ చెప్పారట. ఇది సుదీర్ఘ సిరీస్ కావడంతో ఆటగాళ్లతో పాటు కుటుంబ సభ్యులను కూడా ఇంగ్లండ్ అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులను కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఆటగాళ్ల పైనే ఉంటుందని బోర్డు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
కాగా.. కోహ్లీ సేన జూన్ 18-22 మధ్య ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్‌లో న్యూజిలాండ్‌తో ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ ఆడాల్సి ఉంది. అనంతరం ఇంగ్లండ్‌తో ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 14 మధ్య ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్ జరుగుతుంది.