కరోనా మహమ్మారి క్రికెట్లోకీ ప్రవేశించింది. ముఖ్యంగా క్రికెటర్ల కుటుంబాల్లో ఈ మహమ్మారి వల్ల ఇప్పటికే అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా అనేకమంది ప్రాణాల కోసం పోరాడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా టీమిండియా యువ ఆటగాడు యజ్వేంద్ర చహల్ పేరెంట్స్ కరోనా బారిన పడిన విషయం అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది. ఈ విషయాన్ని చహల్ భార్య ధనశ్రీ వర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. చహల్ తల్లి స్వల్ప లక్షణాలతో హోం ఐసోలేషన్‌లో ఉన్నారని, కానీ చహల్ తండ్రికి మాత్రం లక్షణాలు ఎక్కువగా ఉండడంతో ఆసుపత్రిలో జాయిన్ చేశామని తెలిపింది.
ఇన్‌స్టాలో ఆమె చేసిన పోస్ట్ ప్రకారం.. ”మామయ్య, అత్తయ్య కరోనా బారిన పడ్డారు. ఇటీవల చేసిన టెస్టుల్లో ఇద్దరికీ కరోనా పాజిటివ్ వచ్చింది. అత్తయ్య స్వల్ప లక్షణాలతో హోం ఐసోలేషన్‌లో ఉండగా.. మామయ్య పరిస్థితి కాస్త సీరియస్‌గా ఉంది. దీంతో ఆయనను ఆసుపత్రిలో జాయిన్ చేశాం. ఆయన త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. బయట పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అందరూ ఇంట్లోనే ఉండండి.. మాస్క్ ధరించి క్షేమంగా ఉండండి’’ అంటూ రాసుకొచ్చింది.
ఇక ఐపీఎల్ 14వ సీజన్ తాత్కాలికంగా రద్దు కావడంతో చహల్ ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నాడు. అయితే జూన్‌లో జరగనున్న ప్రపంచటెస్టు చాంపియన్ ఫైనల్‌కు చహల్ ఎంపిక కాలేదు. అయితే జూలైలో శ్రీలంకలో జరిగే వన్డే, టీ20 సిరీస్‌లో చహల్ ఆడే అవకాశాలు ఉన్నాయి.
ఇదిలా ఉంటే ఇదిలా ఉంటే మాజీ క్రికెటర్లు పియూష్ చావ్లా, ఆర్‌పీ సింగ్‌లు కరోనాతో తమ తండ్రులను కోల్పోయారు. అలాగే ఐపీఎల్‌లో రాజస్థాన్ తరపున ఆడిన యువ పేసర్ సకారియా తండ్రి కూడా కరోనా వల్ల మరణించారు. అలాగే మరికొంతమంది ఆటగాళ్ల తల్లిదండ్రులు కూడా కరోనా బారిన పడ్డారు.