దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఎంత దారుణంగా విజృంభిస్తుందో వేరే చెప్పనక్కర్లేదు. లక్షల కేసులు, వేల మరణాలు ప్రతి రోజూ సర్వ సాధారణమయ్యాయి. దీనికి తోడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నా కొన్ని నిర్ణయాల వల్ల ఈ మహమ్మారి ఉధృతి మరింత పెరిగిపోయింది. ప్రధానంగా కుంభమేళా వంటి కార్యక్రమాలతో కరోనా వ్యాప్తి ఒక చోటి నుంచి వేరే చోటికి సులభంగా ప్రయాణించగలగుతోంది.
ఇప్పటికే కుంభమేళా నుంచి తిరిగొచ్చిన అనేకమంది వరుసగా కరోనా బారిన పడుతుండగా.. తాజాగా ఓ బామ్మ కూడా కరోనా బారిన పడినట్లు తేలింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమంటే.. ఆమె ద్వారా మరో 33 మందికి కూడా ఈ వైరస్ సోకింది. కుంభమేళా నుంచి తిరిగొచ్చిన బామ్మ.. ఐసోలేషన్‌లో ఉండాల్సింది పోయి.. నిబంధనలను గాలికొదిలి అందరితో కలిసిపోయింది. ఆమెలో కరోనా వైరస్ ఉండడంతో అది చుట్టుపక్కలున్న వారికీ వ్యాపించింది.
బెంగళూరుకు చెందిన ఓ 67 ఏళ్ల వృద్ధురాలు ఉత్తరాఖండ్‌లో ఇటీవల జరిగిన కుంభమేళాకు వెళ్లొచ్చింది. తర్వాత కొద్ది రోజులకే ఆమెకు కరోనా లక్షణాలు బయటపడ్డాయి. టెస్టు చేయించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆ మహిళతో పాటు ఆమె కుటుంబంలోని మరో 18 మందికి కరోనా వ్యాపించింది. ఈ విషయం తెలియని ఆమె కుటుంబ సభ్యులు వారి వారి రోజువారీ ఉద్యోగాలకు యధావిధిగా వెళ్లసాగారు. ఈ క్రమంలోనే ఆమె కోడలి వల్ల మరో 13 మందికి వైరస్ సోకింది.
ఆమె కోడలు వెస్ట్ బెంగళూరులోని స్పందన హెల్త్‌కేర్ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్‌లో సైక్రియాటిస్టుగా పని చేస్తోంది. దీంతో ఆమె ద్వారా ఆ సెంటర్‌లో ఉన్న 13 మంది రోగులతో పాటు ఇద్దరు సిబ్బందికి కరోనా వ్యాపించింది. అలా మొత్తం 33 మందికి కరోనా సోకింది. ఈ విషయం తెలుసుకున్న అధికారులు.. 67 ఏళ్ల మహిళ నివాసంతో పాటు ఆ పరిసరాలను కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించి సీల్ వేశారు. ఈ విషయం తెలిసిన వారంతా..‘ఎంత పని చేశావ్! బామ్మా. నీ ఒక్కదాని వల్ల ఇప్పుడింత మంది ఆసుపత్రి పాలయ్యారు’ అంటూ మొత్తుకుంటున్నారు.