ఇంతకుముందు ఓ ప్రాంతంపై ఆధిపత్యం కోసం పోరాడేవాళ్లు. ఆ తర్వాత ఓ దేశంపై ఆధిపత్యం కోసం పోరాటాలు జరిగాయి. ఇక ఇప్పుడు ఏకంగా అంతరిక్షంపై ఆధిపత్యం కోసం దేశాలు పోటీ పడుతున్నాయి. పోరాటాలు జరగకపోయినా.. అదే రేంజ్‌లో పోటాపోటీగా ప్రయోగాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కమ్యూనిస్టు దేశం చైనా కూడా అంతరిక్ష పరిశోధనలు, ప్రయోగాల్లో దూసుకుపోతోంది. ఇప్పటికే ఛాంగీ–5 సెర్చింగ్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా చంద్రుడి నమూనాలు భూమీ మీదకు తీసుకువచ్చిన డ్రాగన్ కట్రీ.. వచ్చే ఏడాదికల్లా అంతరిక్షంలో సొంతంగా స్పేస్ స్టేషన్ నిర్మించుకునేందుకు ప్రయత్నిస్తోంది. దీనికి తోడు మరో నెలలో కొందరు వ్యోమగాముల్ని కూడా అంతరిక్షంలోకి పంపడానికి సిద్ధమవుతోంది.
ఈ క్రమంలో తాజాగా చైనా మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. దీంతో ఏకంగా అగ్రరాజ్యం అమెరికా సరసన చేరింది. మార్స్ గ్రహంపై చైనా రోవర్ ఝురొంగ్ విజయవంతంగా ల్యాండ్ అయింది. ఆ దేశ అఫీషియల్ మీడియాలో ప్రకటించింది. అమెరికా తర్వాత.. మార్స్‌పై రోవర్‌ని దించిన రెండో దేశంగా చైనా నిలిచింది. ఈ మేరకు చైనా అధికారిక మీడియా శనివారం ఉదయం మార్స్ మీద ఉన్న సున్నితమైన వాతావరణంలో.. ఓ విశాల మైదానంలో.. రోవర్‌ను సురక్షితంగా దింపినట్లు వెల్లడించింది. ఈ రోవర్ ద్వారా చైనా కూడా మార్స్‌పై మట్టి ఎలా ఉంది..? అందులో ఏ ఖనిజాలు ఉన్నాయి..? అక్కడి కొండలు, గుట్టలు అన్నింటినీ అత్యంత దగ్గర నుంచి పరిశీలించి, వాటి నమూనాలను సేకరించనున్నట్లు తెలుస్తోంది.
గత జులైలో చైనా… తియాన్వెన్-1మిషన్‌ను మార్స్ మీదకు పంపింది. అందులో ఓ ఆర్బిటర్, ఓ ల్యాండర్, ఓ రోవర్ ఉన్నాయి. ఫిబ్రవరి 10న ఈ ఉపగ్రహం అంగారక కక్ష్యలోనికి ప్రవేశించింది. ఇది సోలార్ పవర్ ఉపయోగించుకొని మార్స్‌పై తిరగగలదు. దీనికి కెమెరాలు, రాడార్, మాగ్నెటిక్ ఫీల్డ్ డిటెక్టర్, వెదర్ స్టేషన్ వంటివి ఉన్నాయి. వీటి ద్వారా చైనా అనేక పరిశోధనలు చేయనుంది.