భారత క్రికెట్ బోర్డుకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఓ తీపికబురు అందించింది. అలాగే ఓ చేదు కబురు కూడా చెప్పింది. టీమిండియా జట్టుకు క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇవ్వడం స్వీట్ న్యూస్ అయితే.. టోర్నీ యథావిధిగా అనుకున్న తేదీల్లోనే జరుగుతుందని, నిర్వహణ తేదీల్లో ఎలాంటి మార్పులూ లేవని తేల్చి చెప్పింది. దీంతో ముందుగా అనుకున్నట్లే ఆగస్టు 4 నుంచి టెస్ట్ సిరీస్ జరగనుంది. అందుకుముందు జూన్ 18న న్యూజిలాండ్‌తో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కోహ్లీసేన తలపడనుంది. ఇక ఉమెన్ జట్టు జూన్ 16న ఇంగ్లాండ్‌తో బ్రిస్టల్‌లో ఏకైక టెస్ట్ మ్యాచ్ ఆడనుంది.
త్వరలో ఇంగ్లండ్ పర్యటనుకు భారత్ వెళ్లనుంది. ఇంగ్లాండ్ టూర్ కోసం పురుషుల, మహిళల టీంలు జూన్ 2న ఒకే విమానంలో బయలుదేరాల్సి ఉంది. అయితే పదిరోజుల కఠిన క్వారంటైన్‌కు రెడీగా ఉండాలని ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) తొలుత కండిషన్ పెట్టింది. దీంతో భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఈసీబీతో ప్రత్యేక సంప్రదింపులు జరిపింది. క్వారంటైన్ రోజుల్ని తగ్గించాలని కోరింది.
బీసీసీఐ విన్నపంతో ఈసీబీ దిగొచ్చింది. క్వారంటైన్‌లో ఉండాల్సిన 10 రోజులను 3 రోజులకు కుదించేందుకు ఈసీబీ ఒప్పుకుంది. దీంతో నాలుగో రోజు నుంచే జట్లు ప్రాక్టీస్ చేసుకోవడానికి వీలు దొరుకుతుంది. అయితే క్రికెటర్లకు క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇచ్చిన ఈసీబీ.. ఆటగాళ్ల కుటుంబ సభ్యుల క్వారంటైన్ విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోవల్సి ఉంది.
ఐపీఎల్ టీ20 క్రికెట్ టోర్నమెంట్‌లో మిగిలిపోయిన 31 మ్యాచ్‌లను ఇంగ్లండ్‌లో నిర్వహించేందుకు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. దీనికోసం ఇంగ్లండ్ – భారత్ మధ్య జరగాల్సిన 5 టెస్టుల సిరీస్ షెడ్యూల్‌లో మార్పులు చేయాలని బీసీసీఐ భావిస్తున్నట్లు అనేక రూమర్లు వచ్చాయి. కానీ దీనిపై తమకు అధికారికంగా ఎలాంటి విజ్ఞప్తి రాలేదని ఈసీబీ స్పష్టం చేసింది.
‘బీసీసీఐతో పలు అంశాలపై రెగ్యులర్‌గా మాట్లాడుతున్నాం. కానీ ఐపీఎల్ మ్యాచ్‌లను సర్దుబాటు చేసేందుకు 5 టెస్టుల సిరీస్ షెడ్యూల్‌లో మార్పులు చేయాలని అటునుంచి ఎలాంటి అభ్యర్థనా రాలేదు. ఇప్పటికైతే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే టెస్టు సిరీస్ జరుగుతుంది’ అని ఈసీబీ వెల్లడించింది.