సంగారెడ్డి: కోట్ల భూమిని కొట్టేసేందుకు పక్కాగా ప్లాన్ వేశారు. పగడ్బందీ ఏర్పాట్లతో భూమిని దాదాపు చేజిక్కించుకున్నారు. కానీ.. అదే సమయంలో అసలు హక్కుదారు తెరమీదకు రావండం, అధికారులు అప్రమత్తం కావడంతో వారి బండారం బయటపడింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నగర శివారులోని పటాన్‌చెరు మండలం భానూరు గ్రామంలోని సర్వే నంబరు 497లో తోట హనుమంతరావుకు 20 గుంటల భూమి ఉంది. దీని విలువ బహిరంగ మార్కెట్లో దీని విలువ రూ.3కోట్ల వరకు ఉంటుంది. అయితే 2019లో హనుమంతరావు మరణించాడు. ఆన్‌లైన్‌లో ఆయన పేరిటే భూమి ఉన్నా.. పాసుపుస్తకం మాత్రం తీసుకోలేదు. ఈ మొత్తం విషయాలను పక్కాగా తెలుసుకున్న ఓ వ్యక్తి.. ఆ భూమిని ఎలాగైనా సొంతం చేసుకోవాలని అనుకున్నాడు.
తానే తోట హనుమంతరావునని, తనకు పట్టాదారు పాసు పుస్తకం ఇవ్వాలని కోరాడు. ఈ మేరకు ఏప్రిల్ 19న దరఖాస్తు చేసుకున్నాడు. కొత్త పాసుపుస్తకం ఇవ్వాలని కోరాడు. తోట సత్యనారాయణ పేరుతో సృష్టించిన ఆధార్‌కార్డును ఇందుకోసం ఉపయోగించుకున్నారు. నిందితుడు వేలిముద్ర వేస్తే ఆన్‌లైన్‌లోనూ అది తోట సత్యనారాయణ ఆధార్‌కార్డేనని చూపుతుండటంతో అధికారులూ ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రయత్నించారు. తన ప్లాన్ సక్సెస్ అయిందని నిందితుడు తెగ సంబరపడిపోయాడు.
ఇక్కడే సీన్‌లోకి తోట హనుమంతరావు భార్య తోట కనకదుర్గ ఎంటరైంది. తన భర్త పేరిట ఉన్న భూమిని ఫౌతి మార్పిడి చేయాలంటూ దరఖాస్తు చేసుకున్నారు. తానే వారసురాలినని అందులో పేర్కొన్నారు. అన్ని రకాల ధ్రువపత్రాలను అందించారు. దీంతో అధికారులకు అనుమానం వచ్చింది. తోట హనుమంతరావు మరణిస్తే.. తానే హనుమంతురావునంటూ ముందుకొచ్చిన వ్యక్తి ఎవరంటూ విచారణ మొదలు పెట్టారు. దీంతో ఆ వ్యక్తి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌కి చెందిన గుర్రం పాండుగా గుర్తించారు.
ఆధార్ కార్డు పొందేందుకు అమీన్‌పూర్‌లోని ఒక ఇంటి చిరునామా సమర్పించాడు. అక్కడికి వెళ్లి పరిశీలించగా.. అలాంటి వారు ఎవరూ లేరని స్థానికులు తెలిపారు. దీంతో అన్ని ఆధారాలను జత చేసిన పటాన్‌చెరు తహసీల్దారు మహిపాల్‌రెడ్డి.. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచిత్రం ఏంటంటే.. అదే నకిలీ పేరుతో అతడు ప్రతినెలా స్థానికంగా బియ్యం కూడా తీసుకుంటున్నాడు. ఈ విషయాలు తెలుసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి అతడి కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు.