దేశంలో ఇప్పటివరకు అందుబాటులో ఉన్న కొవ్యాగ్జిన్, కోవిషీల్డ్ మాత్రమే కాకుండా మరో కొత్త వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాదు ఈ వ్యాక్సిన్ ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన అన్ని వ్యాక్సిన్లకంటే అత్యంత చవుకగా కూడా ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ వ్యాక్సిన్‌పై ప్రజలు కూడా తెగ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో బయాలాజికల్-ఈ సంస్థ ఈ వ్యాక్సిన్‌ను తయారు చేస్తోంది. దీనికి కోర్బీవ్యాక్స్‌గా పేరు పెట్టింది. అంతేకాకుండా తమ వ్యాక్సిన్‌ను అత్యంత చవుకగా అందిస్తామని ప్రకటించి ప్రజల్లో ఆసక్తి పెంచింది.
తాజాగా ఈ వ్యాక్సిన్ ధరపై నీతి ఆయోగ్ స్పందించింది. నీతీ ఆయోగ్ ఆరోగ్య శాఖ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ మంగళవారం దీనిపై మీడియాతో మాట్లాడారు. కొర్బీవ్యాక్స్ ధరను బయాలాజికల్-ఈ సంస్థ నిర్ణయించేవరకు వేచి చూద్దామని, కొత్త పాలసీ ప్రకారం ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలపై ఆ ధర ఆధారపడి ఉంటుందని చెప్పారు. అలాగే వ్యాక్సిన్ తయారీకి అందించిన ఆర్థిక సాయం కూడా వ్యాక్సిన్ ధరను ప్రభావితం చేస్తుందని వీకే పాల్ పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే మరో పక్క దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీని వేగవంతం చేసేందుకు కేంద్రం ప్రభుత్వం వేగవంతంగా చర్యలు తీసుకుంటోందని వీకే పాల్ చెప్పారు. ఈ క్రమంలోనే 44 కోట్ల వ్యాక్సిన్ డోసుల కోసం కేంద్రం ఆర్డర్లు పెట్టినట్లు చెప్పారు. 25 కోట్ల కొవీషీల్డ్, 19 కోట్ల కొవ్యాగ్జిన్ డోసులతో పాటు 30 కోట్ల మేర కొర్బీవ్యాక్స్ డోసుల కోసం ముందస్తు ఆర్డర్లు పెట్టినట్లు వెల్లడించారు. ఈ వ్యాక్సిన్లన్నీ దాదాపు సెప్టెంబరుకల్లా అందుతాయని వీకే పాల్ పేర్కొన్నారు.
కాగా.. ఈ వ్యాక్సిన్ ధర రెండు డోసులూ కలిపి దాదాపు రూ.400 నుంచి రూ.500 వరకు ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. మరి నిజంగా ఇదే ధరలో ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే.. అది చాలా గొప్ప విషయమనే చెప్పాలి.