క్షణకాలం మిస్ అయినా సిక్స్ అయ్యే బంతిని అమాంతం గాల్లోకి ఎగిరి అందుకోవడమే కాకుండా.. దానిని తిరిగి మైదానంలోకి విసిరి సూపర్ ఫీల్డింగ్ చేశాడు టీమిండియా బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాహుల్ స్పెక్టాక్యులర్ ఫీల్డింగ్‌కు క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఐదో ఓవర్‌ను అక్షర్ పటేల్ వేశాడు. తొలి బంతికే బట్లర్ లాంగాన్ మీదుగా భారీ షాట్ కొట్టాడు. అది కచ్చితంగా సిక్స్ అవుతుందని బట్లర్‌తో పాటు, ప్రేక్షకులు కూడా అనుకున్నారు. కానీ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న రాహుల్ అమాంతం గాల్లోకి ఎగిరి క్యాచ్ అందుకున్నాడు. కానీ తాను బ్యాలెన్స్ తప్పి బౌండరీ దాటేస్తున్ననని తెలియగానే బంతిని లోపలికి విసిరేశాడు. దీంతో కచ్చితంగా సిక్స్ అనుకున్న కేవలం 2 పరుగులే వచ్చాయి.
ఇక టెస్ట్ సిరీస్‌లానే టీ20 సిరీస్‌ను కూడా టీమిండియా ఓటమితోనే ఆరంభించింది. శుక్రవారం జరిగిన తొలి టీ20లో ఇంగ్లండ్ బౌలర్లను భారత బ్యాట్స్‌మెన్ ఎదుర్కోలేకపోయారు. ప్రధానంగా ఇంగ్లీష్ పేసర్లు మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయించారు. టీమిండియా టాపార్డర్‌ను పేకమేడల్లా కూల్చేశారు. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్(67) ఒక్కడే ఒంటరి పోరాటం చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 124 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంది. దీంతో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 125 పరుగుల టార్గెట్‌ను మరో 27 బంతులు మిగిలుండగానే మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.
ఇదలా ఉంటే టీమిండియా ఫిట్‌నెస్ ప్రస్తుతం టాప్‌క్లాస్‌లో ఉందనడానికి రాహుల్ ఫీల్డింగ్ ఓ ఉదాహరణ అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. టీమిండియా ఆటగాళ్లంతా మైదానంలో చిరుతల్లా కదులుతూ ప్రత్యర్థిని బెంబేలెత్తిస్తున్నారని, ఇక బౌండరీల వద్ద మన వాళ్ల ఫీల్డింగ్ చూస్తే ఎవరైనా ఔరా..! అనాల్సిందేనని కితాబిస్తున్నారు. ఇదే తరహా ఆటతీరు బ్యాటింగ్‌లో కూడా చూపిస్తే కచ్చితంగా టీమిండియా టీ20 సిరీస్‌ను కూడా నెగ్గగలదని అభిప్రాయపడుతున్నారు. కాగా. ఆదివారం రెండో టీ20 జరగనుంది.