దేశంలో విపరీతంగా వినిపిస్తున్న సమస్య జనాభా సమస్య. మరణాల సంఖ్యతో పోల్చితే జననాల సంఖ్య విపరీతంగా ఉండడంతో రోజు రోజుకూ జనాభా కోట్లలో పెరిగిపోతోంది. అయితే ఇప్పుడు కొంతమంది ఒకరు, ఇద్దరు పిల్లలతో సరిపెట్టుకుంటూ కుటుంబ నియంత్రణ పాటిస్తున్నా.. చాలా మంది మాత్రం నలుగురైదుగురు పిల్లలను కంటూనే ఉన్నారు. దీని వల్లనే జనాభా సమస్య పెరుగుతోంది. దీనికి ఓ సమస్య తీసుకురావాలని ఎప్పటి నుంచే దేశంలోని ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. అయితే తాజాగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దీనికి సంబంధించి ఓ సంచనల నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం.జనాభా నియంత్రణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురాబోతోంది. దీని ప్రకారం.. రాష్ట్రంలో ఇద్దరికంటే పిల్లలున్న వారికి ప్రభుత్వ పథకాలన్నింటినీ కట్ చేసేలా ఆ పథకాన్ని రూపొందిస్తోందని తెలుస్తోంది.
దీనికోసం ఇతర రాష్ట్రాల్లో ఈ చట్టాన్ని ఎలా అమలు చేస్తున్నారన్న విషయంపై ఆయా రాష్ట్రాలకు ఓ అధ్యయన బృందాన్ని కూడా యోగి సర్కార్ పంపనుందట. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాలకు కూడా ఈ కమిటీ అధ్యయనం కోసం వెళ్లనుందట. ఆయా రాష్ట్రాల్లోని పద్ధతులను అధ్యయనం చేసి, ఈ సభ్యులు సీఎం యోగికి ఓ రిపోర్టును సమర్పిస్తారట. అలాగే అధిక జనాభాతో ఉత్పన్నమయ్యే నిరుద్యోగం, ప్రభుత్వ పథకాలను పొందడంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కూడా ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. దానిని అనుసరించి కొత్త చట్టాన్ని రూపొందించాలని యోగి సర్కార్ ఆలోచన చేస్తోందట.
ఈ కొత్త చట్టంలో ప్రధాన అంశంగా.. ఇద్దరి కంటే ఎక్కువగా సంతానం ఉండే వారికి రాబోయే రోజుల్లో ప్రభుత్వం కల్పించే సౌకర్యాలు కానీ, రాయితీలు గానీ అందకుండా నిర్ణయం తీసుకోబోతోందట. దీని ద్వారా జనాభా నియంత్రణే కాక.. నిరుద్యోగం, పేదరికం వంటి సమస్యలను కూడా ఎదుర్కొన వచ్చని యోగి సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం.