మరికొద్ది నెలల్లో టీ20 ప్రపంచకప్ జరగబోతోంది. ఈ టోర్నీలో భారత్ హాట్ ఫేవరెట్ జట్లలో ఒకటిగా బరిలోకి దిగనుంది. ఈ టోర్నీలో కూడా భారత్.. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోనే బరిలోకి దిగనుంది. అయితే ఈ టోర్నీలో ప్రతిభ కనబరచడం కోహ్లీకి తప్పనిసరిగా మారింది. ఇప్పటికే వరుస ఐసీసీ టోర్నీలో ఓటమి పాలవడం, తాజాగా డబ్ల్యూటీసీ ఫైనల్లో చేతికొచ్చిన మ్యాచ్‌లో ఓడిపోవడంతో కోహ్లీపై తీవ్ర విమర్శలు మొదలయ్యాయి. అతడి కెప్టెన్సీలో కానీ, బ్యాటింగ్‌లో కానీ మునుపటి వాడి తగ్గిందని ఆరోపణలూ మొదలయ్యాయి.
ఇలాంటి పరిస్థితుల్లో జరుగుతున్న ఐసీసీ కీలక టోర్నీ కావడంతో టీ20 ప్రపంచకప్‌లో కోహ్లీ కెప్టెన్సీపైనే అందరి దృష్టీ నెలకొంది. అంతేకాదు.. ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే కెప్టెన్సీ మార్పులు సంభవించే అవకాశం ఉండవచ్చని మాజీ క్రికెటర్ దీప్‌దాస్‌గుప్తా అభిప్రాయపడ్డాడు. ఇటీవల ఓ యూట్యూబ్ చానల్లో మాట్లాడిన దీప్‌దాస్.. టీ20 ప్రపంచకప్‌తో కోహ్లీ కెప్టెన్సీ భవితవ్యంపై స్పష్టత వస్తుందన్నాడు. ప్రస్తుతం భారత్‌కు కెప్టెన్సీ మార్పు చేయడం సరికాదని చెప్పను కానీ.. కోహ్లీ మళ్లీ తనను తాను నిరూపించుకోలేకపోతే.. కెప్టెన్సీ రోహిత్‌కే దక్కే అవకాశం ఉందని అన్నాడు.
‘రోహిత్ ఇదివరకే పలు సందర్భాల్లో నాయకత్వం వహించాడు. అయినా, తాత్కాలిక కెప్టెన్సీకి పూర్తిస్థాయి కెప్టెన్సీకి చాలా వృత్యాసం ఉంటుంది. ఎందుకంటే స్టాండ్ ఇన్ కెప్టెన్‌గా ఉంటూ జట్టులో పెద్దగా మార్పులు చేయకపోవచ్చు. కానీ, ఎవరైనా పూర్తిస్థాయి కెప్టెన్‌గా మారినప్పుడు జట్టులో తనదైన ముద్ర వేయాలని అనుకుంటాడు’ అని దీప్‌దాస్ పేర్కొన్నాడు.