టీమిండియా స్టార్ ఆటగాళ్లైన కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలపై పాక్ మాజీ పేసర్ మహమ్మద్ ఆమిర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. రోహిత్, కోహ్లీలకు బౌలింగ్ చేయడాన్ని తానెంతగానో ఆస్వాదిస్తానని, వారిద్దరూ పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్(పీఎస్ఎస్)లో ఆడితే ఆ మజానే వేరని అన్నాడు. అలాగే పరిమిత ఓవర్లలో లెఫ్టార్మ్ పేసర్లను ఎదుర్కోవడంలో భారత జట్టు ఓపెనర్ రోహిత్ శర్మ ఇబ్బంది పడతాడని, రోహిత్‌తో పోల్చితే కోహ్లీకి బౌలింగ్ చేయడం కొంత కష్టమని చెప్పుకొచ్చాడు. రోహిత్-కోహ్లీలతో కలిసి క్రికెట్ ఆడాలని అనుకుంటున్నాని అన్నాడు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమిర్ కోహ్లీ, రోహిత్‌ల గురించి తన అభిప్రాయాలను బయటపెట్టాడు. ‘కోహ్లీతో పోలిస్తే రోహిత్‌కు బౌలింగ్ చేయడం సులభం. కోహ్లీ ఒత్తిడిలో మెరుగ్గా రాణిస్తాడు. కానీ కోహ్లీతో పోల్చితే రోహిత్ అందులో కొంత వెనుకడగులో ఉంటాడు. అయితే వారిద్దరికి బౌలింగ్ చేయడం ఎప్పుడూ కఠినంగా అనిపించలేదు. రోహిత్‌ను తాను ఇన్ స్వింగ్, ఔట్ స్వింగ్‌తో ఔట్ చేయగలన’ని ఆమిర్ చెప్పుకొచ్చాడు.
కాగా.. ఆమిర్ 2009లో పాకిస్తాన్ క్రికెట్ జట్టులోకి అడుగుపెట్టాడు. అయితే కేవలం ఒక్క ఏడాదిలోనే స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొని ఏడేళ్ల నిషేధంపాలయ్యాడు. ఈ ఫిక్సింగ్ విషయంలోనే ఇంగ్లండ్‌లో కొన్నాళ్లు జైల్లో కూడా గడిపాడు. ఇక 2017లో నిషేధం తరువాత తిరిగి జట్టులోకొచ్చిన ఆమిర్.. ఆ ఏడాది జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో అంచనాలకు మించి రాణించాడు. భారత్‌తో జరిగిన ఫైనల్‌లో అమిర్ మ్యాజిక్‌తో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. పాకిస్తాన్ నిర్దేశించిన 339 పరుగుల టార్గెట్‌లో రోహిత్, ధావన్, కోహ్లీలనే ఆరంభంలోనే ఔట్ చేసి ఆమిర్.. భారత్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. దాంతో ఫైనల్ మ్యాచ్‌లో పరాజయం పాలైన కోహ్లీసేన.. రన్నరప్‌గానే సరిపెట్టుకుంది. అయితే అనూహ్యంగా పీసీబీ, కోచ్, సెలక్షన్ కమిషన్ తనను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తోందంటూ ఆమిర్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి అందరినీ ఆశ్చర్య పరిచాడు.