ప్రపంచ క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్ ఎవరంటే సచిన్ టెండూల్కర్ అని ఠక్కున చెప్పేస్తాం. ఇప్పటివరకు సచిన్ సాధించినన్ని పరుగులు ప్రపంచ క్రికెట్లో ఎవరూ సాధించలేదు. అయితే మహిళల క్రికెట్లో మాత్రం మనకు ఆ ఘనత ఇన్నాళ్లూ కొంత దూరంలో ఉంది. కానీ తాజాగా టీమిండియా మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ మహిళా ఆ మార్కును అందుకుంది. మహిళా క్రికెట్లో చరిత్ర సృష్టించింది. అన్ని ఫార్మాట్లలోనూ కలిపి అత్యధిక పరుగులు సాధించిన తొలి మహిళా క్రికెటర్‌గా తన పేరును మహిళా క్రికెట్ చరిత్రలో లిఖించుకుంది. ఈ క్రమంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ చార్లొట్టే ఎడ్వర్డ్స్‌ను అధిగమించింది.
3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో శనివారం చివరి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 220 పరుగుల లక్ష్యాన్ని భారత్ ముందుంచింది. బ్యాటింగ్‌కు దిగిన భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మిథాలీ రాజ్ 75 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈ క్రమంలోనే ఇంగ్లీష్ పేసర్.. నట్ షివెర్ వేసిన 23వ ఓవర్‌లో బౌండరీ బాదిన మిథాలీ.. ఎడ్వర్డ్స్ 10,273 పరుగులను దాటింది. దీంతో ప్రపంచంలోనే అత్యధిక పరుగులు సాధించిన విమెన్ క్రికెటర్‌గా చరిత్ర పుటల్లో స్థానం సంపాదించకుంది.
మ్యాచ్ అనంతరం మిథాలీ మాట్లాడుతూ.. మ్యాచ్ మధ్యలో అవుటవకూడదని, చివరి వరకు పోరాడి మ్యాచ్‌లో విజయం సాధించాలని నిర్ణయించుకున్నట్టు తెలిపింది. చేజింగ్ తనకు ఎంతో ఇష్టమని పేర్కొంది. కాగా మూడు వన్డేల సిరీస్‌లో తొలి రెండు వన్డేల్లో విజయం సాధించిన ఇంగ్లండ్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఈ నెల 9 నుంచి ప్రారంభం కానుంది.
కాగా.. ఇప్పుడు అటు మెన్స్ క్రికెట్లో, ఇటు విమెన్స్ క్రికెట్లో, రెండింటిలోనూ అత్యధిక పరుగులు సాధించి ప్లేయర్లు టీమిండియా నుంచే ఉండడం విశేషం. దీంతో నెటిజన్లు కూడా మిథాలీపై విపరీతంగా ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘మిథాలీ.. నీ పరుగుల దాహం కొనసాగించు’ అంటూ ప్రోత్సహిస్తున్నారు.