ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఘోరంగా ఓడిపోయింది. ప్రధానంగా బ్యాట్స్‌మెన్ దారుణంగా విఫలమయ్యారు. టాప్ ఆర్డర్ మొత్తం సింగిల్ డిజిట్‌కే పరిమితం కాగా.. ఇక కెప్టెన్ కోహ్లీ కనీసం ఖాతా కూడా తేరవలేకపోయాడు. ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో మిడ్ ఆన్ మీదుగా బౌండరీ బాదడానికి ప్రయత్నించి డకౌట్‌గా వెనుదిరిగాడు. 30 యార్డ్ సర్కిల్ లోపలే అర్చర్ చేతికి చిక్కాడు.
కోహ్లీని డకౌట్ చేయడంపై రషీద్ మాట్లాడుతూ.. కోహ్లీ వంటి ప్రపంచ స్థాయి ఆటగాడిని డకౌట్ చేయడం గొప్ప విషయమని అన్నాడు. కోహ్లీ రావడానికి ముందు ప్రేక్షకులు ఎలా ఉంటారో తనకు తెలుసని, అలాంటి గొప్ప ఆటగాళ్లను త్వరగా అవుట్ చేస్తే ప్రేక్షకులను కూడా సైలెంట్ చేయొచ్చని చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచులో మూడు ఓవర్లు వేసిన రషీద్.. 14 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 4.67 సగటుతో ఇండియా బ్యాట్స్‌మెన్‌ను దెబ్బ తీశాడు. ఇక మరో విషయం ఏంటంటే రషీద్ మ్యాచ్ మొత్తంలో కోహ్లీని మాత్రమే అవుట్ చేశాడు.
ఇదిలా ఉంటే అహ్మదాబాద్ వేదికగా జరిగిన తొలి టీ20లో టీమిండియాపై ఇంగ్లండ్ అద్భుత విజయం సాధించింది. అహ్మదాబాద్ వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు భారత్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించింది. భారత్ నిర్దేశించిన 125 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లీష్ జట్టు కేవలం 2 వికెట్లు కోల్పోయి 15.3 ఓవర్లోనే ఛేదించింది. ఇక టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఆరంభంలోనే భారీ ఎదురుదెబ్బ తిన్నది. ఓపెనర్లు, మిడిలార్డర్ అనే తేడా లేకుండా అంతా పూర్తిగా విఫలమయ్యారు. శ్రేయాస్ అయ్యర్ అర్థ సెంచరీ మినహా మరో బ్యాట్స్‌మెన్ ఎవరూ కూడా అశించిన స్థాయిలో బ్యాటింగ్ చేయలేదు. ఈ విజయంతో టీ20 సిరీస్‌లో ఇంగ్లండ్ బోణీ కొట్టింది. సిరీస్‌లో 1-0తో ఆధిక్యం సాధించింది. ఇక ఈ రోజు(ఆదివారం) రెండో టీ20 జరగనుంది. మరి ఈ మ్యాచ్‌లో అయినా టీమిండియా విజయం సాధిస్తుందా..? అనేది చూడాలి.