1975లో తొలి వన్డే ప్రపంచకప్ జరిగింది. ఆ తరువాత అనేకసార్లు వన్డే వరల్డ్ కప్‌లు జరిగాయి. 1983 ప్రపంచకప్ భారత్ గెలిచింది. ఆ తర్వాత 2011లో టీమిండియా మరోసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది. అయితే ఈ రెండు కప్‌లకు మధ్యలో జరిగిన ఓ విశ్వ టోర్నీలో కూడా ఇండియా ఓ అరుదైన ఘనత సాధించింది. అప్పటివరకు ఏ జట్టుకూ సాధ్యంకాని ఓ ఫీట్ సాధించి శభాష్ అనిపించుకుంది.
2007 వరకు ఏ జట్టు కూడా ప్రపంచకప్‌లో 400 పరుగులు చేయలేదు. 1996 ప్రపంచకప్‌లో కెన్యాపై శ్రీలంక చేసిన 398/5 పరుగులు మాత్రమే అప్పటివరకు అత్యధిక స్కోర్. కానీ తొలిసారి 2007 ప్రపంచకప్‌లో(14 ఏళ్ల క్రితం) మార్చి 19న బెర్ముడాతో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 400పైగా పరుగులు చేసింది. మొత్తంగా 5 వికెట్లు కోల్పోయిన టీమిండియా 413 పరుగులు చేసింది. ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(114) సెంచరీతో కదం తొక్కగా.. మరో ఓపెనర్ సౌరవ్ గంగూలీ(89), వన్‌డౌన్‌లో వచ్చిన సచిన్ టెండూల్కర్(57) అర్థ సెంచరీతో రాణించారు.
కాగా ఈ మ్యాచ్‌లో 414 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెర్ముడా జట్టు టీమిండియా బౌలర్ల ధాటికి తట్టుకోలేకపోయింది. ప్రధానంగా జహీర్ పేస్‌కు దాసోహమైంది. జహీర్ తన తొలి ఓవర్లోనే బెర్ముడా ఓపెనర్ ఆలివర్ పిచర్‌ను అవుట్ చేసి విజయానికి నాంది పలికాడు. డేవిడ్ హెంప్(76) ఒక్కడే బెర్ముడా తరపున అర్థ సెంచరీతో రాణించాడు. దీంతో 43.1 ఓవర్లలో 156 పరుగులకు బెర్ముడా జట్టు ఆలౌటైంది.