రీల్ విలన్ అయినా.. రియాల్ హీరోగా మారి ఎంతో మందిని ఆదుకుంటున్నాడు బాలీవుడ్ నటుడు సోనూసూద్. కరోనా వల్ల అల్లకల్లోలమైన అనేక జీవితాల్లో వెలుగులు నింపుతున్నాడు. ఎంతోమంది పేదలకు ఆర్థికంగా అండగా ఉంటున్నాడు. మరెంతో మంది నిస్సహాయులకు సాయం చేస్తూ వారి దృష్టిలో దేవుడిగా మారాడు. గతేడాది మాత్రమే కాదు.. ఈ ఏడాది కూడా సోనూసూద్ తనలోని మానవత్వాన్ని మరోసారి నిరూపించుకుంటున్నాడు. కరోనా నేపథ్యంలో ఆక్సిజన్ అందక, బెడ్లు అందక, సరైన వైద్య సదుపాయాలు లభించక అవస్థలు పడుతున్న వారిని అనేకమందికి రేయింబవళ్లు కష్టపడుతూ అనేకమంది ప్రాణాలు కాపాడుతున్నాడు.
ఈ క్రమంలోనే తాజాగా ఆక్సిజన్, బెడ్స్, ఇంజెక్షన్స్ ఇలా ఎవ్వరికి ఎలాంటి అవసరం వచ్చినా నేరుగా తనను సంప్రదించాలటే ఓ టోల్ ఫ్రీ నెంబర్‌ను కూడా సోనూసూద్ మొదలు పెట్టేశాడు. అయితే ప్రస్తుతం దేశంలో నెలకొన్న వైద్య విధానంపై, వైద్యులపై తాజాగా సోనూసూద్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా కోవిడ్ వైద్య బృందాలకు సూటిగా ప్రశ్నించారు.
వైద్యులు సూచిస్తున్న మందులు ఎక్కడా దొరకడం లేదని, అలా దొరక్కపోయినా.. వాటిని వైద్యులు ప్రస్క్రైబ్ చేస్తున్నారని, దీనివల్ల ఆ మందు లభించక బాధితులు, వారి కుటుంబ సభ్యులు నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఒకవేళ సదరు ఔషధం లేదా, ఇంజక్షన్ దొరకడమే కష్టమైనప్పుడు, దానినే వైద్యులు ఎందుకు సూచిస్తున్నారని, ప్రత్యామ్నాయాలు ఎందుకు ఆలోచించడం లేదని సూటిగా ప్రశ్నించాడు. సోనూ విసిరిన ఈ ప్రశ్నకు నెటిజన్లు మద్దతు కూడా భారీగా లభిస్తోంది. ఎక్కడా లభించని ఇంజెక్షన్లు, మందులు ప్రిస్క్రైబ్ చేస్తే సదరు బాధితుడికి అది లభించదని, అప్పుడు వైద్యం ఎలా చేస్తారంటూ నెటిజన్లు కూడా వైద్యులను నిలదీస్తున్నారు. సోనూ వేసిన ప్రశ్నకు కచ్చితంగా ప్రభుత్వాలు, వైద్యులు సమాధానం చెప్పాల్సిందేనంటూ డిమాండ్ కూడా చేస్తున్నారు.