దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రోజూ లక్షల మంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రధానంగా మహారాష్ట్ర, కర్ణాటకల్లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. దేశంలోనే కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్న రాష్ట్రాలుగా ఇవి ఇప్పటికే లెక్కల్లోకెక్కాయి. అయితే ఇప్పడు కర్ణాటకలో పరిస్థితులు థర్డ్ వేవ్‌కు దారి తీశాయా అనే ఆందోళన కలుగుతోంది. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో పిల్లలు కరోనా బారిన పడుతుండడంతో ఈ థర్డ్ వేవ్ వచ్చేసిందనే ఆందోళన కూడా స్థానికుల నుంచి వ్యక్తమవుతోంది.
ఫస్ట్‌వేవ్‌లో పెద్ద వయసువారు, సెకండ్ వేవ్‌లో యువత కరోనా బారిన పడ్డారు. థర్డ్ వేవ్‌లో చిన్నారులకు ముప్పు ఉంటుందనే ఆందోళన సర్వత్రా నెలకొంది. చిన్నారులు కరోనా బారిన పడటానికి కారణం కర్నాటకలో చిన్నారుల్లో పెరుగుతున్నకేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. పద్దేనిమిదేళ్లు దాటిన వారికే ప్రస్తుతం టీకాలు ఇచ్చే పరిస్థితి దేశంలో కనిపించడం లేదు. ఇప్పుడు 18 ఏళ్లలోపు ఏజ్ గ్రూప్‌లోనూ కేసులు పెరగడం కలవరం కలిగిస్తోంది.
కరోనా ఫస్ట్ వేవ్‌లో వయోవృద్ధులు, వయసు మీద పడిన వారు తీవ్ర ప్రభావానికి గురయ్యారు. ప్రస్తుత సెకండ్ వేవ్‌లో యువకులు, మధ్య వయస్కులు కోవిడ్ కోరల్లో చిక్కుకుంటున్నారు. ఇక థర్డ్ వేవ్‌లో చిన్నపిల్లలపై ఈ మహమ్మారి ప్రభావం చూపిస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు ఇప్పుడున్న పరిస్థితుల ఆధారంగా దేశంలో థర్డ్ వేవ్ తప్పదని కూడా హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లోనే కర్ణాటకలో పిల్లలపై కరోనాపై ప్రభావం చూపిస్తుండడం కలకలం సృష్టిస్తోంది. దీనికి కారణం ఇండియన్ స్ట్రెయిన్, సింగపూర్ స్ట్రెయిన్.. రెండింటిలో ఏది కారణమనే వాదనలు వెలుగులోకొస్తున్నాయి. రాష్ట్రంలో కరోనా కొత్త మ్యూటెంట్‌లు ఏమైనా వచ్చాయేమో అనే అనుమానాలతో పాటు కరోనా థర్డ్ వేవ్ వచ్చేసిందనే ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి.
2 వారాలుగా రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలు చేస్తోంది ప్రభుత్వం. కానీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదు. అది చాలదన్నట్లు చిన్నారుల్లో కరోనా పెరుగుతండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రధానంగా 10 నుంచి 19 ఏళ్ల లోపు చిన్నారులు ఎక్కువగా ఈ మహమ్మారి బారిన పడుతుండడం ఆందోళనకరంగా మారింది. 2020-2021 మార్చి వరకు రాష్ట్రంలో లక్షల మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. అయితే ఈ కేసుల్లో మార్చి వరకు 9 ఏళ్ల లోపు 27,841 కేసులు నమోదు కాగా.. 10 నుంచి 19 ఏళ్ల లోపు 65,551 మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. కానీ కరోనా సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 10 నుంచి 19 ఏళ్ల మధ్య వయసున్న చిన్నారులు రికార్డు స్థాయిలో 1,05,044 మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. ఇక 9 ఏళ్ల లోపు చిన్నారులు 39,846 మంది చిన్నారులకు కరోనా సోకింది. అంటే స్వల్ప వ్యవధిలోనే చిన్నారుల్లో 145 శాతం, టీనేజ్ పిల్లల్లో 160 శాతం అధికంగా కేసులు నమోదు జరిగిందని అఫీషియల్ స్టేట్‌మెంట్స్ ద్వారా తెలుస్తోంది. మరణాలు కూడా ఇదే స్థాయిలో పెరిగాయి. గతేడాది నుంచి మార్చి వరకు 9 ఏళ్లలోపు వారు 28మంది మరణించగా.. ఈ 2 నెలల్లో 15 మందికి పైగా కోవిడ్ కారణంగా మరణించారు. ఇక టీనేజ్ పిల్లల మరణాలు మరింత పెరిగాయి. 46 నుంచి 62కి చేరుకున్నాయి.
కాగా.. ఇంట్లో పెద్దవారు కరోనా బారిన పడడం, ఆ విషయం తెలియని చిన్నారులు వారికి చేరువగా వెళ్లడం, వారితో కలిసి ఉండడం వంటి పరిస్థితుల కారణంగానే చిన్నారుల్లో కరోనా ఉధృతి పెరుగుతోందని అనేక అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. ఇదిలా ఉంటే దేశంలో ప్రస్తుతం 18 ఏళ్ల పైబడిన వారికి కరోనా టీకా అందించేలా కేంద్రం మార్గదర్శకాలున్నాయి. అయితే దీని అమలు మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. యువకులు, పెద్దలకు టీకాలు ఇవ్వడానికే కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలకు పూర్తి స్థాయిలో సాధ్యం కావడం లేదు. ఇక ఇప్పుడు చిన్నారులకు వ్యాక్సిన్‌లు వేయడం సాధ్యమయ్యే పని కాదు. ఇతర వైద్య విధానాల ద్వారానే చికిత్స అందించాల్సి ఉంటుంది.