రాజకీయాలంటేనే జంపింగ్‌లు.. ఆ జంపింగ్ నేతలు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో..? ఏ పార్టీలో చేరుతారో..? మళ్లీ ఇంకో పార్టీలోకి ఎప్పుడెళ్లిపోతారనేది వాళ్లకు తప్ప ఎవరికీ తెలియదు. ఒకప్పటి రాజకీయాలతో పోలిస్తే.. ఇప్పుడున్న రాజకీయ నేతలు చాలా విచిత్రంగా ఉంటారు. అటు.. ఇటు.. ఇటు అటు జంపింగ్‌లు చేస్తూనే ఉంటారు. పైగా అభిమానులు, కార్యకర్తలు, నియోజకవర్గం అభివృద్ధి.. ఇలా ఇంకా ఎన్నెన్నో మాటలు చెప్పి గోడ దూకేస్తుంటారు.
అయితే.. జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్, బీజేపీ నుంచి 2016 -2020 మధ్య కాలంలో ఎంతమంది ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు జంపింగ్ చేశారన్న విషయాన్ని ‘అసోసియేషన్ ఆఫ్ డెమోక్రెటిక్ రిఫార్మ్స్’ అనే ప్రముఖ సంస్థ సర్వేను విడుదల చేసింది. ఈ సర్వేలో కాంగ్రెస్‌కు భారీగా దెబ్బలే తగిలాయని.. అని ప్రకటించింది.
పూర్తి వివరాల్లోకెళితే.. కాంగ్రెస్‌కు చెందిన 170 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీని హ్యాండిచ్చి.. వేరే పార్టీల్లో చేరిపోయారని తెలిపింది. ఇక బీజేపీలో మాత్రం 18 మంది మాత్రమే ఆ పార్టీకి గుడ్ బై చెప్పి ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయారని పేర్కొంది. సరిగ్గా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఇలా సర్వే ప్రకటించడం గమనార్హం.
ఇదిలా ఉంటే.. ఒక పార్టీ తరఫున సరిగ్గా ఎన్నికల సమయంలోనే చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు జెండాలు మార్చేశారని ఆ సర్వేలే సదరు సంస్థ వెల్లడించింది. అంతేకాదు.. పార్టీలు మారిన వారిలో ఎంత మంది గెలుపొందారు..? వారిలో మళ్లీ ఎంత సొంత పార్టీలోకి వెళ్లారు..? ఎంత మంది అదే పార్టీలో ఉన్నారన్న విషయాన్ని కూడా ఆ సంస్థ నిశితంగా వివరించింది.