ముంబై: టీమిండియా టెస్టు స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్న ఆటగాడు చతేశ్వర్ పుజారా. అతడు ఐపీఎల్‌లో ఆడేందుకు ఎప్పుడెప్పుడా అని ఉవ్విళ్లూరుతున్నాడు. దాదాపు ఏడేళ్ల పాటు పుజారా చేసిన నిరీక్షణకు ఈ సీజన్‌తో తెర పడనుంది. ఏడేళ్ల తర్వాత ఐపీఎల్‌లో ఆడనున్న పుజారాను ఫిబ్రవరిలో జరిగిన మినీ వేలంలో రూ. 50 లక్షలకు సీఎస్‌కే కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే ప్రాక్టీస్ సమయంలోనూ పుజారా సిక్సర్ల వర్షం కురిపించి తనలో ఎంత కసి దాగుందో కనబరిచాడు. అయితే అతనికి సీఎస్‌కే అవకాశాలు ఇస్తుందా అన్న అనుమానం ఉన్నా.. తనకు చాన్స్ ఇస్తే మాత్రం తన విలువేంటో చూపించేందుకు పుజారా ఉత్సుకతతో ఉన్నాడు. ఈ నేపథ్యంలో పుజారా తన సహచర ఆటగాడు హనుమ విహారి గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హనుమ విహారిని కూడా ఏదో ఒక ఫ్రాంచైజీ కొనుగోలు చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు.
”మనం టీమిండియా తరపున ఏదైనా సాధించినప్పుడు ప్రజలు ఎంతగానో ఇష్టపడడం సాధారణం.. ఆ విలువ ఎలా ఉంటుందనేది నాకు తెలుసు. ఇప్పుడు నేను ఐపీఎల్‌లో ఆడుతున్నందుకు ఎంత సంతోషంగా ఉన్నానో.. నా సహచరులు కూడా అంతే ఆనందంతో ఉన్నారు. గత కొన్నేళ్లలో టీమిండియాలో ఉన్న సహచరుల్లో ఐపీఎల్ మిస్సయ్యింది నేను మాత్రమే అనుకుంటా. దాదాపు ఏడేళ్ల తర్వాత ఐపీఎల్‌లో బరిలో ఆడబోతున్నా. ఇన్నాళ్లూ ఐపీఎల్‌లో అవకాశం రానందుకు చాలా బాధ పడ్డాను. ప్రస్తుతం హనుమ విహారి ఆ బాధను అనుభవిస్తున్నాడు. 2018 తర్వాత అతన్ని ఏ జట్టు వేలంలో తీసుకోవడానికి ముందుకు రాలేదు. కానీ అతను ఐపీఎల్‌లో ఏదో ఒక జట్టుకు ఆడి ఉంటే బాగుండేది. గతంలో విహారి ఐపీఎల్‌లో ఆడాడు.. ఇప్పుడు కూడా ఉంటే బాగుంటుంది..” అని చెప్పుకొచ్చాడు.
అయితే హనుమ విహారి గతంలో ఐపీఎల్ జట్లు సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2019లో ఎస్‌ఆర్‌హెచ్ హనుమ విహారిని రిలీజ్ చేసింది. ఆ తర్వాత అతన్ని కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించలేదు. ఇదిలా ఉంటే పుజారా ఐపీఎల్‌లో 30 మ్యాచ్‌లు ఆడాడు. వాటిలో 390 పరుగులు సాధించాడు. గతంలో కేకేఆర్, ఆర్‌సీబీలకు ఆడిన పుజారా తాజాగా సీఎస్‌కే తరపున ఆడనున్నాడు. ఈ సీజన్‌లో సీఎస్‌కే తన తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఏప్రిల్ 10న జరగనుంది. అయితే ఐపీఎల్ 14వ సీజన్‌కు కరోనా సెగ అంటుకుంది. ఆటగాళ్లంతా వరుసగా కరోనా బారిన పడుతుండడంతో ఫ్రాంచైజీలు ఆందోళన పడుతున్నాయి.