ఐపీఎల్ 2021లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ముంబై ఇండియన్స్ అనూహ్యమైన విజయం సాధించింది. కేకేఆర్ ఇన్నింగ్స్ 15 ఓవర్ల వరకు మ్యాచ్ కచ్చితంగా గెలిచేస్తుందని అనుకున్నారు. కానీ చివరి 5 ఓవర్లలో ముంబై బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. దీంతో చివరి 30 బంతుల్లో కేవలం 20 పరుగులు మాత్రమే చేసి ఏకంగా 10 పరుగుల తేడాతో కేకేఆర్ ఓటమి పాలైంది. కేకేఆర్ బ్యాట్స్‌మెన్‌లో ఓపెనర్లు నితీశ్ రాణా(57: 47 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులు) అర్థ సెంచరీతో రాణించగా.. శుభ్‌మన్ గిల్(33: 24 బంతుల్లో 5 ఫోర్లు 1 సిక్స్) ఓ మోస్తరు పరుగులు చేశాడు. వీరిద్దరి తరువాత మరే బ్యాట్స్‌మన్ కూడా కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. కాగా.. 152 పరుగుల లక్ష్యాన్ని సైతం కాపాడుకుని ముంబై ఈ సీజన్‌లో బోణీ కొట్టింది. ముంబై బౌలర్లలో రాహుల్ చాహర్ 4 వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్ 2 రెండు వికెట్లు, కృనాల్ పాండ్యా ఓ వికెట్ తీసుకున్నారు.
ఇదిలా ఉంటే అంతకుముందు టాస్ గెలిచిన కేకేఆర్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ముంబై బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్ క్వింటన్ డీకాక్(2) వెంటనే అవుటైనా.. కెప్టెన్ రోహిత్ శర్మ(43: 32 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) సంయమనంతో ఆడాడు. అతడికి సూర్యకుమార్ యాదవ్(56: 36 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సులు) తోడు కావడంతో జట్టు స్కోరు వేగంగా కదిలింది. కానీ వీరిద్దరూ అవుటైన తరువాత మరో బ్యాట్స్‌మన్ ఎవరూ ఆశించిన స్థాయిలో రాణించలేదు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ముంబై 10 వికెట్లు కోల్పోయి 152 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ముంబై బ్యాట్స్‌మెన్‌ను కేకేఆర్ బౌలర్లు ముప్పు తిప్పలు పెట్టారు. మొదటి బంతి నుంచి కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ బ్యాట్స్‌మన్ పరుగులు చేయకుండా కట్టడి చేశారు. క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచారు. కేకేఆర్ ఆల్‌రౌండర్ ఆండ్రూ రస్సెల్ బౌలింగ్‌లో విజృంభించాడు. రెండు ఓవర్లే వేసినా 5 వికెట్లు తీసి ముంబైను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. అంతేకాకుండా రెండు ఓవర్లలోనూ కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి పరుగులను కట్టడి చేశాడు. అలాగే ప్యాట్ కమిన్స్ 2 వికెట్లు తీయగా.. ప్రసిద్ధ్ కృష్ణ, షకిబ్ అల్ హసన్, వరుణ్ చక్రవర్తిలు తలా ఓ వికెట్ దక్కించుకున్నారు.