తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై బెంగళూర విజయం సాధించింది. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు చివరి బంతి వరకు పోరాడి ఎలాగైతేనేం విజయం సాధించింది. బెంగళూరు బ్యాట్స్‌మెన్‌లలో ఏబీ డివిలియర్స్(48: 27 బంతుల్లో, 4 ఫోర్లు, 2 సిక్సులు), గ్లెన్ మ్యాక్స్‌వెల్(39: 28 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సులు), విరాట్ కోహ్లీ(33: 29 బంతుల్లో, 4 ఫోర్లు) ధాటిగా ఆడారు. ఇక మిగతా బ్యాట్స్‌మెన్‌లలో వాషింగ్టన్ సుందర్(10) మినహా మరెవరూ రెండంకెల స్కోరు కూడా చేయలేదు. ముంబై బౌలర్లలో జస్ప్రిత్ బుమ్రా, మార్కో జాన్సేన్ చెరో రెండు వికెట్లు తీయగా, ట్రెంట్ బౌలర్, కృనాల్ పాండ్యాలకు చెరో వికెట్ తీశారు.
కాగా.. అంతకుముందు బెంగళూరు బౌలర్లు అదరగొట్టారు. ముంబై బ్యాట్స్‌మన్ పరుగులు చేయకుండా కట్టడి చేశారు. బెంగళూరు బౌలర్లలో హర్షల్ పటేల్ ఏకంగా 5 వికెట్లు తీసి ముంబై మిడిలార్డర్‌ను దెబ్బతీశాడు. ఆరంభం నుంచి బెంగళూరు బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేశారు. తొలుత కైల్ జేమీసన్, మహ్మద్ సిరాజ్.. ముంబై ఓపెనర్లు రోహిత్ శర్మ(19), క్రిస్ లిన్(49)లను బౌండరీలు బాదకుండా కట్టిడి చేశారు. వారి స్పెల్ తరువాత లిన్ ధాటిగా ఆడి బౌండరీలతో విరుచుకుపడ్డాడు. అయితే అర్థ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో వాషింగ్టన్ సుందర్ అద్భుతమైన డెలివరీ వేయడమే కాకుండా రిటర్న్ క్యాచ్ కూడా అందుకుని లిన్‌ను అవుట్ చేశాడు. ఇక ఆ తరువాత ఎవరూ పెద్దగా రాణించలేదు. దానికి తోడు వరుస ఓవర్లలో వికెట్లు కోల్పోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో ముంబై జట్టు 9 వికెట్లకు 159 పరుగులు మాత్రమే చేసింది.
ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో బౌలర్లు హైలెట్‌గా నిలిచారు. ఇరు జట్ల బౌలుర్లు కట్టుదిట్టండి బౌలింగ్ చేయడంతో బ్యాట్స్‌మన్ పరుగులు చేయడానికి చెమటోడ్చారు. తొలుత ముంబై బ్యాట్స్‌మన్‌ను బెంగళూరు బౌలర్లు పరుగులు చేయకుండా అడ్డుకోవడమే కాక, క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టారు. ఆ తరువాత బెంగళూరు బ్యాట్స్‌మన్‌ను ముంబై బౌలర్లు కూడా చివరి వరకు నిలువరించారు. కానీ చివరి బంతికి బెంగళూరు ఎలాగోలా గట్టెక్కింది.