సచిన్ టెండూల్కర్ 2011 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ లైవ్‌లో చూడలేదట. సెహ్వాగ్‌ను కూడా చూడనివ్వలేదట. ఈ విషయాన్ని సచిన్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఇద్దరూ డ్రెస్సింగ్ రూంలోనే ఉన్నప్పటికీ.. మ్యాచ్‌ను లైవ్‌లో చూడలేదని, అంతకుముందు మ్యాచ్‌లో ఇలానే మ్యాచ్ చూడకపోవడం వల్ల టీమిండియా గెలిచిందని, అందువల్లే దానిని గట్టిగా నమ్మేశానని, ఆ నమ్మకంతోనే లైవ్ చూడడానికి ఇష్టపడలేదని సచిన్ చెప్పాడు. సెహ్వాగ్ కూడా తనతోనే ఉండడం వల్ల అతడిని కూడా చూడనివ్వలేదని చెప్పాడు. కాగా.. ఫైనల్ మ్యాచ్‌లో 275 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమిండియా 48.2 ఓవర్లలోనే టార్గెట్‌ను ఛేదించింది. అయితే టోర్నీ మొత్తం అద్భుతంగా రాణించి టాప్ 2 స్కోరర్‌గా నిలిచిన సచిన్ ఫైనల్‌లో మాత్రం 18 పరుగులకే అవుటయ్యాడు. ఇక సెహ్వాగ్ అయితే ఏకంగా డకౌట్ అయి అభిమానులకు షాక్‌కు గురిచేశాడు.
31 పరుగులకే సెహ్వాగ్(0), సచిన్(18) వంటి కీలక వికెట్లను కోల్పోయి టీమిండియా పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. ఆ సమయంలో ఎడమ చేతి బ్యాట్స్‌మన్ టీమిండియాను ఆదుకున్నాడు. ఆచి తూచి ఆడుతూ వికెట్ పడకుండా కాపాడుతూ విరాట్(35), ధోనీ సాయంతో స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. ఓపెనర్‌గా వచ్చిన గంభీర్ 42వ ఓవర్ వరకు క్రీజులో పాతుకుపోయి శ్రీలంక బౌలర్లకు చెమటలు పట్టించాడు. 122 బంతుల్లో 9 ఫోర్లతో 97 పరుగులు చేసిన గంభీర్.. జట్టు స్కోరు 223 వద్ద నాలుగో వికెట్‌గా వెనుతిరిగాడు.
ఆ తర్వాత ధోనీ ధాటిగా ఆడి టీమిండియాకు విజయాన్ని అందించాడు. గంభీర్ అందించిన అదిరిపోయే ఆరంభానికి అద్భుతమైన ఫినిష్ ఇచ్చి మరో 10 బంతులు మిగిలుండగానే జట్టుకు విజయాన్ని అందించాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధోనీ.. ఏకంగా 78 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సులతో 91 పరుగులు చేశాడు. శ్రీలంక బౌలర్లను దీటుగా ఎదుర్కొని మైదానంలో బౌండరీల మోత మోగించాడు. టీమిండియా 28 ఏళ్ల కలను భారీ సిక్సర్‌తో నెరవేర్చాడు.