ఇటీవల జరిగిన పేటీఎం టెస్ట్ సిరీస్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో ఇంగ్లండ్ జట్టును చిత్తు చేసింది. తొలి టెస్టు ఓడిపోయినా.. తరువాతి మూడు టెస్టుల్లో గెలిచి ఏకంగా 3-1 తో విజయం సాధించింది. అయితే ఇంగ్లండ్ జట్టు ఓటమికి గల కారణాలను ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బ్యాట్స్‌మన్ బెన్‌స్టోక్స్ తెలిపాడు. ఈ సిరీస్ తాము ఓడిపోవడానికి అనేక పరిస్థితులు కారణమని చెప్పాడు. గెలిచే సత్తా ఉన్నా తమకు అలవాటు లేని వాతావరణ పరిస్థితుల కారణంగా సరైన ప్రదర్శన ఇవ్వలేక పోయామని అన్నాడు. ‘అలవాటు లేని ప్రతికూల వాతావరణంలో ఆడాల్సి వచ్చింది. ఎన్ని సమస్యలున్నా జట్టు కోసం ఆడాలి కాబట్టి, బాధను ఓర్చుకుని బరిలో దిగాం. అందుకే పోరాడినా ఓడిపోయామ’ని స్టోక్స్ అన్నాడు.
భారత్‌లో వేడి చాలా ఎక్కువగా ఉందని, దాని కారణంగా తాము ఎన్నో ఇబ్బందులకు గురయ్యమని, భారత్‌కు వచ్చిన కొన్ని రోజుల వ్యవధిలోనే కిలోల కొద్దీ బరువు తగ్గామని చెప్పాడు. ఈ తరుణంలో తాను ఒక వారం రోజుల్లో దాదాపు ఐదు కిలోల బరువు తగ్గానని తెలిపాడు. ఇక ఇతర ఆటగాళ్లు డామ్ సిబ్లీ 4 కిలోలు, జిమ్మీ ఆండర్సన్ 3 కిలోలు బరువు తగ్గారని స్టోక్స్ వివరించాడు. స్పిన్నర్ జాక్ లీచ్ ఇక్కడి వాతావరణానికి అలవాటు పడలేకపోయాడని, బౌలింగ్ స్పెల్ విరామం వచ్చినప్పుడల్లా లీచ్ టాయిలెట్‌కు పరిగెత్తేవాడని స్టోక్స్ చెప్పాడు.
ఇంగ్లండ్‌లో వాతావరణానికి ఇక్కడి వాతావరణానికి చాలా తేడా ఉందని, అక్కడి చల్లటి వాతావరణం ఉండటం కారణంగా, భారత్‌లో తాము 41 డిగ్రీల ఎండ వేడిమిని భరించలేకపోయామని స్టోక్స్ అన్నాడు. అయితే, టీమిండియా ఆటగాళ్లకు ఇక్కడి వాతారణం అలవాటేనని, అందుకనే వారికి ఎటువంటి ఇబ్బంది కలుగలేదని స్టోక్స్ అభిప్రాయపడ్డాడు. సుందర్, పంత్ వంటి ఆటగాళ్లు క్రీజులో నిలదొక్కుకుని మంచి ఇన్నింగ్స్ ఆడడానికి కూడా అదే కారణమని అభిప్రాయపడ్డాడు. అన్ని సరిగ్గా ఉంటే టీమిండియాకు దీటుగా రాణించేవారమని, తాము ఎదుర్కొన్న సమస్యల కారణంగా తమ జట్టు ప్రదర్శన ఆశించిన స్థాయికంటే దారుణంగా ఉందని స్టోక్స్ వివరించాడు.