ఈ ఏడాది ఐపీఎల్ కోసం అన్ని జట్లూ స్టార్ ఆటగాళ్లలో కోట్లు పోసి మరీ కొనుగోలు చేశాయి. దీంతో ఈ సారి ఏ జట్టు ట్రోఫీ గెలుస్తుందని చెప్పడం మరింత కష్టమైంది. ఈ క్రమంలోనే సీనియర్ ఆటగాళ్ల మధ్య కూడా ఈ విషయంలో భారీ చర్చలు జరుగుతున్నాయి. విశ్లేషకులు కూడా ప్రతి జట్టులో ఉన్న అన్ని విభాగాలనూ పరిశీలిస్తూ వారికి తోచి అంచనాలు వారు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ కూడా ట్విటర్ వేదికగా ఐపీఎల్ విజేత ఎవరో చెప్పాడు. తన అంచనా ప్రకారం ఈ సారి కూడా ట్రోఫీ ముంబైదేనని కుండబద్దలు కొట్టాడు.
‘ఐపీఎల్ 14 టైటిల్‌ను కూడా ముంబై ఎగరేసుకుపోతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. కచ్చితంగా సిక్సర్ కొడుతుంది. అలా కాకుండా ముంబై టైటిల్ చేజార్చుకోవాలంటే ఏదో అద్భుతం జరగాల్సిందే. ఒకవేళ కప్పు ముంబై చేజార్చుకుంటే.. అది దక్కించుకునే సత్తా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మాత్రమే ఉంది. మరే జట్టుకూ అది సాధ్యం కాకపోవచ్చు’ అంటూ వాన్ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. వాన్ చేసిన ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. అయితే వాన్ అంచనాలను ఇతర జట్ల అభిమానులు తిరస్కరిస్తున్నారు. ‘అన్నీ నువ్వే డిసైడ్ చేస్తే, ఇన్ని జట్లు ఆడటం ఎందుకం’టూ ప్రశ్నిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఏప్రిల్ 9 నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్ మొదటి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ఈ మ్యాచ్ ఎంతో ఉత్కంఠను కలిగిస్తుందని అభిమానులు భావిస్తున్నారు. ఇక సన్‌రైజర్స్ తన తొలి మ్యాచ్‌ను ఏప్రిల్ 11న చెన్నై వేదికగా కోల్‌కతాతో ఆడనుంది. ఇక ఏప్రిల్ 17న, మే 4న ముంబై, హైదరాబాద్ జట్లు పోటీ పడనున్నాయి. మరి వాన్ చెప్పిన ఈ రెండు పటిష్ఠ జట్లలో విజేత ఎవరనే విషయం తేలాలంటే అప్పటివరకు ఆగాల్సిందే.