చెన్నై: క్రికెట్ ప్రేమికులు ఎంతో అత్రుతగా ఎదురు చూసిన ఐపీఎల్ మొదటి మ్యాచ్‌లో ఆర్‌సీబీ విజయకేతం ఎగరవేసింది. అయితే ఈ మ్యాచ్‌లో పాండ్యా బౌలింగ్ చేయకపోవడం అభిమానులను కాస్త నిరాశ చెందించిందనే చెప్పాలి. అసలు పాండ్యా ఎందుకు బౌలింగ్ చేయలేదన్న విషయాన్ని సహచర ఆటగాడు క్రిస్‌లిన్ బయటపెట్టాడు. ఐపీఎల్ 2021 మొదటి మ్యాచ్ సమయానికి పాండ్యా భుజం నెప్పితో ఇబ్బంది పడుతున్నాడని అందుకనే అతడు బౌలింగ్ చేయలేదని క్రిస్‌లిన్ తెలిపాడు. అంతేకాకుండా బ్యాట్స్‌మన్‌గా పాండ్యా జట్టుకు కీలకమని, ఒకవేళ బౌలింగ్ చేసే సమయంలో నెప్పి పెరిగితే జట్టు మొత్తం ఇబ్బంది పడుతుందని అన్నాడు. హార్దిక్ పూర్తిగా కోలుకున్న తర్వాత బంతితో మ్యాజిక్ చేయగలడని విశ్వాసం వ్యక్తం చేశాడు.
ఐపీఎల్ 2021లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. తక్కువ స్కోర్లే నమోదైనా.. ఇరు జట్లు బౌలర్లూ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో చివరి బంతి వరకు మ్యాచ్ చాలా ఉత్కంఠగా సాగింది. అయితే ఆఖరి బంతికి ఆర్సీబీ ఎలాగోలా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముంబై బౌలర్లు కూడా చివరి
వరకు అద్భుతంగా బౌలింగ్ చేసినా.. ఆఖరి బంతికి ఆర్సీబీ విజయం సాధించింది. కాగా.. ముంబై ఆటగాళ్లలో క్రిస్ లిన్(49) తప్ప మిగిలిన వాళ్లెవరూ రాణించకపోవడంతో ముంబై స్వల్ప స్కోరుకే పరిమితమైంది. ముంబై ఇచ్చిన లక్ష్యాన్ని కోహ్లి సేన ఛేధించి టోర్నీ మొదటి గెలుపును సొంతం చేసుకుంది.
నిన్న మ్యాచ్ ఆడిన ముంబై జట్టు ఆటగాళ్ల మధ్య సమన్వయ లోపం ఉంది. దాని కారణంగా సారథి రోహిత్ శర్మ రనౌట్ అయ్యాడు. దాంతో పాటుగా హార్దిక్ పాండ్యా కూడా త్వరగానే పెవిలియన్ చేరడం జట్టుకు మరో దెబ్బగా మారింది. దీంతో ముంబై జట్టు భారీ మూల్యమే చెల్లించింది. అయితే మ్యాచ్ తరువాత మాట్లాడిన క్రిస్ లిన్ అనేక విషయాలు చెప్పాడు. పాండ్యా భుజం నొప్పి కారణంగా అతడి అద్భుత బౌలింగ్‌ను ఉపయోగించుకోలేక పోయామన్నారు. ఈ ఒక్క మ్యాచ్‌లో పాండ్యా బౌలింగ్‌ను చూడలేక పోయినా అతడు ఆడనున్న 14 మ్యాచ్‌లలో వీరవిహారం చేస్తాడని, అప్పుడు ముంబై రెట్టించిన బలంతో ప్రత్యర్థులను చీల్చిచెండాడుతుందని అన్నాడు.
ఇదిలా ఉంటే నిన్నటి మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన ఆర్సీబీ బౌలర్ హర్షల్ పటేల్ ఏకంగా 5 వికెట్లతో ముంబైని తీవ్రంగా దెబ్బ తీశాడు. ఐపీఎల్ చరిత్రలో ముంబై జట్టుపై ఒకే ఇన్నింగ్స్‌లో ఇన్ని వికెట్లు మరే బౌలర్ తీయలేదు. దీంతో అతడికే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కింది.