ఐపీఎల్ 14 సీజన్లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్-ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌పైనే ప్రస్తుతం సర్వత్రా చర్చ జరుగుతోంది. 15 ఓవర్ల వరకు మ్యాచ్ పూర్తిగా కేకేఆర్ చేతిలో ఉన్నా.. అక్కడి నుంచి మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. కనీసం బ్యాట్ పట్టుకోవడం కూడా రానట్లు కేకేఆర్ బ్యట్స్‌మన్ ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయారు. దీంతో 32 బంతుల్లో 32 పరుగులు చేయాల్సిన పరిస్థితి నుంచి 6 బంతుల్లో 15 పరుగులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. అయితే చివరి ఓవర్లో రస్సెల్, కమిన్స్ వికెట్లను కోల్పోవడమే కాకుండా 4 పరుగులు మాత్రమే చేయగలిగారు. దీంతో 10 పరుగుల తేడాతో ముంబై చేతిలో ఓడిపోయింది. ఈ ఓటమితో కేకేఆర్ ఎంత బాధపడిందో తెలియదు కానీ.. అనేకమంది సీనియర్ ఆటగాళ్లు మాత్రం ఆ జట్టు దారుణ ప్రదర్శనపై మండిపడుతున్నారు.
ప్రధానంగా కేకేఆర్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్లు దినేశ్ కార్తీక్(9), ఆండ్రూ రస్సెల్(9)లపై టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. సునాయాసంగా విజయతీరాలకు చేరాల్సిన సమయంలో రస్సెల్, డీకేలు అలసత్వం ప్రదర్శించారని, అందుకే కేకేఆర్ ఓటమి మూటకట్టుకుందని విమర్శించాడు. సరిపడా బంతులు, చేతిలో వికెట్లున్నా ఎదురుదాడి చేయకపోవడం విచిత్రంగా ఉందని అన్నాడు. ‘రస్సెల్ క్రీజ్‌లోకి వచ్చినప్పుడు 27 బంతుల్లో 30 పరుగులు చేయాల్సి ఉంది, చేతిలో ఇంకా 5 వికెట్లు ఉన్నాయి. సునాయాసంగా గెలవాల్సిన ఇలాంటి పరిస్థితుల్లో కూడా వారిలో జట్టును గెలిపించాలన్న కసి కనిపించలేదు. తొలి మ్యాచ్ విజయం అనంతరం కెప్టెన్ మోర్గాన్ చెప్పిన సానుకూల దృక్పథం అన్నది వీరిద్దరిలో నాకైతే ఎక్కడా కనపడలేద’ని ఎద్దేవా చేశాడు.
కేకేఆర్ బ్యాటింగ్‌లో శుభ్‌మన్, నితీశ్ రాణా, షకిబ్, మోర్గాన్‌లు జట్టును గెలిపించాలన్న ఉద్దేశంతో బ్యాటింగ్ చేశారని, అయితే దురదృష్ట వశాత్తూ వారు వికెట్లు కోల్పోయారని, కానీ రస్సెల్, డీకేల పరిస్థితి అలా కాదని, వారిద్దరి చేతకాని తనం వల్లనే కేకేఆర్ ఓడిందని వీరూ నిప్పులు చెరిగాడు. ఈ ఓటమితో కేకేఆర్ సిగ్గుతో తల దించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తీవ్ర విమర్శలు చేశాడు.