చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కలకత్తా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ ఆండ్రూ రస్సెల్ ఎలా విజృంభించి ఆడాడో అందరికీ తెలిసిందే. తొలి బంతి నుంచే చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. క్రీజులో ఉన్నంత సేపూ బౌండరీల వర్షం కురిపించాడు. 221 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్.. తొలి 5 వికెట్లు 45 పరుగుల లోపే కోల్పోయింది. దీంతో మ్యాచ్‌పై పూర్తి స్థాయిలో ఆశలు కోల్పోయింది. అలాంటి పరిస్థితుల్లో క్రీజులోకొచ్చిన రస్సెల్.. మ్యాచ్‌ను మలుపు తిప్పేశాడు. రస్సెల్ ఆటతీరు చూస్తే.. చెన్నై ఓటమి పక్కా అనిపించింది. 22 బంతుల్లోనే 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 53 పరుగలు చేసి అర్థ సెంచరీతో రస్సెల్ అదరగొట్టాడు. అయితే అతడు అవుటైన తరువాత దినేశ్ కార్తీక్, ప్యాట్ కమిన్స్ పోరాడినా.. 202 పరుగుల వద్ద కేకేఆర్ ఆలౌటైంది.
కీపర్ దినేశ్ కార్తీక్‌తో కలిసి 83 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పిన తర్వాత శామ్ కర్రాన్ బౌలింగ్‌లో రస్సెల్ అవుటయ్యాడు. 12 ఓవర్ రెండో బంతి వైడ్ వెళుతుందనుకున్న రస్సెల్ వదిలిపెట్టగా.. అది వెనుకనుంచి వచ్చి లెగ్ స్టంప్‌ను గిరాటేసింది. దీంతో రస్సెల్ ఆటకు ఎండ్ కార్డ్ పడింది. ఆరో వికెట్‌గా పెవిలియన్ చేరిన రస్సెల్.. డగౌట్‌లోని మెట్లపైనే కూర్చుండిపోయాడు. గ్లౌజ్‌లు, ప్యాడ్లు, హెల్మెట్ తీయకుండా అలా మ్యాచ్ చూస్తూ ఉండిపోయాడు. మెట్లపై రస్సెల్ కూర్చున్న ఫోటో ఆన్లైన్లో వైరల్ కావడంతో రస్సెల్ వివరణ ఇచ్చాడు. ‘అవుటైన తర్వాత ఛేంజింగ్ రూమ్‌కు వెళ్లలేకపోయా. రూమ్‌కి ఎలా వెళ్లాలో తెలియక మెట్లపై కూర్చొండిపోయా. మా జట్టు సభ్యుల వద్దకు వెళ్లే ధైర్యం నాలో లేకపోయింది. వారి వద్దకు ఏ ముఖంతో వెళ్లాలో అర్థం కాలేదు’ అని రస్సెల చెప్పాడు. కేకేఆర్ ఫ్రాంచైజీ అయిన www.kkr.in లో వెల్లడించాడు.
అంతేకాకుండా వెనకనుంచి వెళ్లిపోతుందనుకున్న బంతి.. వికెట్లను గిరాటేయడం నిజంగా బాధ కలిగించిందని రస్సెల్ అన్నాడు. ఆ క్షణంలో తనకు పూర్తిగా అర్థం కాలేదని, సాధారణంగానే తాను చాలా ఎమోషనల్ పర్సన్ అని, ఆ తత్వమే తనను మరింత రాటుదేలేలా చేస్తుందని రస్సెల్ అన్నాడు. తన పని ఇంకా పూర్తి కాలేదని, జట్టుకు అవసరమైన స్థాయిలో రాణించి విజయాల పట్టించడమే తన ముందు ప్రస్తుతం ఉన్న కర్తవ్యమని రసెల్ పేర్కొన్నాడు.