అత్యంత కట్టుదిట్టమైన బయోబబుల్‌లో సురక్షిత వాతావరణంలో గడుపుతున్న ఐపీఎల్ క్రికెటర్లకు కరోనా సోకడం ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తోంది. టోర్నీలోని రెండు ఫ్రాంచైజీలకు చెందిన ఇద్దరు ఆటగాళ్లు ఈ మహమ్మారి బారిన పడినట్లు సమాచారం. దీంతో ఐపీఎల్ యాజమాన్యం కూడా ఒక్కసారిగా షాకైంది. వెంటనే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. సదరు ఆటగాళ్లు ఉన్న జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
దేశంలో తీవ్రంగా విజృంభిస్తున్న కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి తాజాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను కూడా తాకింది. మంగళవారం రాత్రి 7.30 గంటలకు ఆర్సీబీ, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ క్రమంలో కరోనా పరీక్షలు నిర్వహించగా కోల్‌కతా ఆటగాళ్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్‌కు వైరస్ సోకినట్లు తేలింది. దీంతో షాకైన ఐపీఎల్ యాజమాన్యం వెంటనే మ్యాచ్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
కేకేఆర్ జట్టులో వీరిద్దరితో పాటు మరికొంతమంది కూడా స్వల్ప అస్వస్థతకు గురైనట్లు సమాచారం. దీంతో, టీం మొత్తం ఐసోలేషన్‌లోకి వెళ్లింది. దీనిపై బీసీసీఐ అధికారి ఒకరు స్పందిస్తూ.. ఇద్దరు కేకేఆర్ ఆటగాళ్లకు కరోనా నిర్ధారణ కావడంతో సోమవారం నాటి మ్యాచ్‌ను వాయిదా వేసినట్లు వెల్లడించారు. అంతేకాకుండా తదుపరి తీసుకోవాల్సి చర్యలపై కూడా చర్చిస్తున్నట్లు వెల్లడించారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు కేకేఆర్ జట్టు మొత్తం ఐసోలేషన్‌లో ఉండడంతో ఆ జట్టు తదుపరి మ్యాచ్‌లు ఆడే అవకాశాలు తగ్గిపోయాయి. కనీసం 7 రోజులైనా ఐసోలేషన్లో ఉండాల్సిన నేపథ్యంలో మిగతా మ్యాచ్‌లకు దూరం కానుందనే వార్తలు వినవస్తున్నాయి. అయితే దీనిపై కేకేఆర్ యాజమాన్యం కానీ, బీసీసీఐ అధికారులు కానీ ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు.