భారత దేశంలో కరోనా సెకండ్ వేవ్ ధాటికి భారత్ వణికిపోతోంది. ప్రతి రోజూ లక్షల కేసులు. వేల మరణాలు. నిద్ర లేస్తే ఎవరి గురించి ఏ చేదు వినాల్సి వస్తుందోనని అంతా ప్రాణాలు గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. దీంతో ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో కర్ఫ్యూ, లాక్డౌన్ తరహా ఆంక్షలను కూడా అక్కడి ప్రభుత్వాలు అములు చేస్తూ కరోనాను కట్టడి చేసేందుకు నానా అవస్థలు పడుతున్నాయి. అయితే ఇప్పుడు వినిపిస్తున్న మరో భయంకరమైన విషయం ఏంటంటే.. టాయిలెట్ సింక్ ద్వారా కూడా కరోనా వ్యాపిస్తుందట. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఫ్లషింగ్ టాయిలెట్ల ద్వారా కరోనా వైరస్ సులభంగా వ్యాపిస్తోందంటూ ఓ సందేశం ఉంది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
కరోనా వైరస్ అనేది గాలి ద్వారా వ్యాపిస్తుందనే ఇప్పటివరకు తెలుసు. కానీ ఇటీవల ఫిజిక్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అనే ఓ జర్నల్‌లో ఓ అధ్యయనం ప్రచురితమైంది. టాయిలెట్ వినియోగ సమయంలో జరిగే మల-నోటి సంక్రమణ మార్గాన్ని నిరోధించడం ద్వారా నోవల్ కరోనా వైరస్ వ్యాప్తికి చెక్ పెట్టవచ్చునని ఈ పరిశోధన పేర్కొంది. ఫ్లషింగ్ టాయిలెట్ వినియోగించి నీటిని వదిలినప్పుడు బలమైన నీటి ప్రవాహం వల్ల పెద్ద ఎత్తున తుంపరలు చెలరేగుతాయని, కంటికి కనిపించనంత పరిమాణంలో కనిపించని సూక్ష్మ జీవులన్నీ 40-60 శాతం టాయిలెట్ సీట్ కంటే పైకి వెళ్లి అక్కడే 30-70 సెకన్ల వరకూ ఉంటాయని తేలుతోంది. ఇదే సమయంలో కరోనా రోగులు టాయిలెట్ వినియోగించినప్పుడు వారి మలం ద్వారా కూడా వైరస్‌ను విసర్జిస్తారని, దానిని ఫ్లష్ చేసినప్పుడు ఆ వైరస్ గాలిలో ఉండి తర్వాత వచ్చిన వారికి వ్యాప్తి చెందుతుందని అంటున్నారు.
దీనిపై వైద్యులు కూడా హెచ్చరికలు చేస్తున్నారు. కొవిడ్ రోగితో కలిసి కుటుంబ సభ్యులు టాయిలెట్ షేర్ చేసుకోవడం కచ్చితంగా ప్రమాదమేనని హెచ్చరిస్తున్నారు. ముంబైలో అయితే ప్రత్యేక టాయిలెట్ ఉంటేనే అధికారులు కొవిడ్ రోగులను హోం ఐసొలేషన్‌కు అనుమతిస్తున్నారని, ఒకే టాయిలెట్ వినియోగించడం వల్ల కుటుంబంలోని మిగతా వారికి వ్యాధి సోకే అవకాశం ఉన్నందున ఇలాంటి నిబంధన పెట్టారని చెబుతున్నారు.
అయితే ఒకవేళ అది సాధ్యం కాకపోతే.. కొవిడ్ రోగులతో కలిసి కుటుంబ సభ్యులు వాడే టాయిలెట్‌కి కచ్చితంగా ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉండేలా చూసుకోవాలని, అలాగే ఫ్లష్ చేసే ముందు టాయిలెట్ సీట్‌ను మూసివేయాలని సూచిస్తున్నారు. టాయిలెట్ సీట్‌పై వైరస్ ఉండే అవకాశం ఉండడంతో దాన్ని ఉపయోగించే ముందు శుభ్రంచేయడం, డిసిన్ఫెక్టెంట్లను వినియోగించడం తప్పనిసరి సూచిస్తున్నారు.