అత్యంత భద్రత నడుమ గత నెల రోజులుగా నిర్వహిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కరోనా మహమ్మారి ప్రత్యక్షమైంది. దీంతో టోర్నీ అర్థాంతరంగా ముగిసిపోయింది. దీంతో టోర్నీలో పాల్గొనేందుకు వచ్చిన విదేశీ ఆటగాళ్లంతా స్వదేశాలకు వెళ్లిపోతున్నారు. స్వదేశీ ఆటగాళ్లు ఇళ్లకు బయలు దేరుతున్నారు. వీరిని క్షేమంగా వారి వారి దేశాలకు, ఇళ్లకు పంపించే బాధ్యత బీసీసీఐ తీసుకుంది. ఇక కొన్న ఫ్రాంచైజీలు కూడా తమ ఆటగాళ్లను ప్రత్యేక విమానాల్లో ఇళ్లకు పంపిస్తున్నాయి. అయితే కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లలోని సభ్యులు కరోనా బారిన పడడంతో ఆయా జట్లు ప్రస్తుతం ఐసోలేషన్లో ఉన్నాయి. ఈ క్రమంలోనే చెన్నై సారథి మహేంద్ర సింగ్ ధోనీ తాను ఎప్పుడు ఇంటికి వెళ్లేదీ తెలిపాడట.
ప్రస్తుతం చెన్నై శిబిరంలో ఉన్న ధోనీ.. ఆ శిబిరం నుంచి ఇంటికి వెళ్లే చివరి వ్యక్తిని తానే అవుతానని చెప్పాడు. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ఢిల్లీలో ఉంది. ఇటీవల వర్చువల్‌గా నిర్వహించిన సమావేశంలో జట్టు సభ్యులతో ధోనీ మాట్లాడాడు. ఇప్పటికే దేశీయ ఆటగాళ్లను సొంత నగరాలకు చేర్చేందుకు సీఎస్‌కే ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఓ ఛార్టర్ ఫ్లైట్‌ను ఈ రోజు చెన్నై ఫ్రాంచైజీ ప్రారంభించింది. ఇందులో ట్రిప్పుకు 10 మంది ఆటగాళ్ల చొప్పున తమ తమ ఇళ్లకు చేరుకోనున్నారు. ఈ విమానం ద్వారా నేడు(గురువారం) ఉదయం ముంబై, రాజ్‌కోట‌్‌కు చెందిన ఆటగాళ్లను తీసుకెళ్లింది. సాయంత్రం విమానంలో బెంగళూరు, చెన్నై క్రికెటర్లు వెళ్తారు. చివర్లో ధోనీ బయలుదేరి రాంచీ చేరుకుంటాడు.
ఈ క్రమంలోనే ఓ వర్చువల్ సమావేశంలో మాట్లాడిన చెన్నై సభ్యుడు.. `ఐపీఎల్ భారత్‌లో జరుగుతుండడం వల్ల తొలుత విదేశీ ఆటగాళ్లు బయలుదేరాలి. ఆ తర్వాతి ప్రాధాన్యం భారతీయ ఆటగాళ్లది. శిబిరం నుంచి వెళ్లే చివరి వ్యక్తిని నేనేనేన`ని ధోనీ తనతో చెప్పినట్లు సదరు చెన్నై సభ్యుడు వెల్లడించాడు. ఇప్పటికే విదేశీ ఆటగాళ్లు బయల్దేరి వెళ్లిపోవడంతో ప్రస్తుతం స్వదేశీ ఆటగాళ్లు కూడా ఇళ్లకు బయలుదేరారు. వీరి కోసం చెన్నైలానే ఇతర ఫ్రాంఛైజీలు కూడా ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేశాయి.