Friday, November 1, 2024

కరోనా నుంచి కోలుకున్నారా..? మరో మహమ్మారి రెడీగా ఉంది జాగ్రత్త..!

కరోనాను జయించారా..? దిగ్విజయంగా కరోనా నుంచి కోలుకుని హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారా..? అయితే ఆగండి. ఈ ఆర్టికల్ మీకోసమే. కరోనా కోలుకున్నా.. మీ ప్రాణాలకు ముప్పు తీరిపోలేదు. కరోనాను మించిన దారుణ ఫంగస్ మీ చుట్టుపక్కలే ఉంది. మీ చుట్టూ ఉన్న వాతావరణంలో ఎప్పుడెప్పుడు మిమ్మల్ని కబళించేద్దామా అని ఎదురు చూస్తోంది. ‘కరోనానే జయించాం. ఇదెంత’ అని భ్రమపడకండి. కరోనా ఒక్కసారి ప్రాణాలనే తీస్తుంది. కానీ ఈ ఫంగస్ మిమ్మల్ని లోపలి నుంచి తినేస్తుంది. ముందుగా ముక్కు లోపలి భాగం, ఆ తర్వాత కళ్లు, ముఖం, మెదడు ఇలా ఒక్కో అవయవాన్ని తినేస్తూ మీ ప్రాణాలను సైతం హరిస్తుంది.

ఇప్పటికే ఢిల్లీ తదితర ప్రాంతాల్లో ఈ ఫంగస్ బయటపడగా, తాజాగా గుజరాత్ రాష్ట్రంలోనూ ఈ కేసులు బయటపడ్డాయి. ‘మ్యూకోర్‌మైసిస్‌’ అనే పేరుగల ఈ ఫంగస్‌ను బ్లాక్ ఫంగస్ అని కూడా పిలుస్తారు. ఇప్పటికే దాదాపు 40మంది ఈ ఫంగస్ బారిన పడినట్లు అధికారిక లెక్కల ప్రకారం తెలుస్తోంది. వీరిలో 8మంది ఏకంగా చూపును సైతం కోల్పోయారు. వీరంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఫంగస్ కూడా ప్రాణాపాయం కావడంతో వైద్యులు వారందరికీ సత్వర చికిత్స అందిస్తున్నారు. దీనిపై వైద్య నిపుణులు స్పందిస్తూ.. ఈ ఫంగస్‌ను ముందుగా కనిపెడితే చికిత్స ద్వారా నయం చేయవచ్చని, కానీ ఆలస్యమైతే చూపు కోల్పోతారని, ఇంకా ఆలస్యమైతే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

ఎక్కడుంటుంది..? ఎలా వస్తుంది..?
అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజెస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ప్రకారం.. మ్యూకోర్మిసెటెస్ అనే ఫంగి ద్వారా ఈ ఇన్ఫెక్షన్ బాధితుల్లోకి ప్రవేశిస్తుంది. ఇది చుట్టూ వాతావరణంలోనే ఎల్లప్పుడూ ఉంటుంది. ఇది సైనస్ లేదా ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది. చర్మం తెగినా, కాలినా, ఇతర చర్మ సంబంధిత గాయాల ద్వారా ఇది శరీరంలోకి ప్రవేశిస్తుంది. అంతేకాకుండా గాలి పీల్చుకొన్నప్పుడు ఈ ఫంగస్‌ ఊపిరితిత్తుల్లో, సైనస్‌ వద్ద చేరతాయి. ఇది మనుషులకు అరుదుగా సోకుతుంటుంది. ముఖ్యంగా శరీరంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి ఇది ఎక్కువగా సోకుతూ ఉంటుంది.

కరోనా రోగుల్లోనే ఎందుకు..?
కొవిడ్‌ సోకిన వారిలో ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉంటుంది. దానికి తోడు కరోనా బారిన పడుతున్న వారు అనేకమంది ఇతర ఆరోగ్య సమస్యలతోనూ బాధపడుతూ ఉంటారు. అలాగే కరోనా నుంచి కోలుకోవడానికి వినియోగించే స్టెరాయిడ్స్‌ వల్ల కూడా వారిలో బాధితుల్లో ఇమ్యూనిటీ బాగా తగ్గిపోతుంది. అలాంటి సమయంలోనే ఈ ఫంగస్ వారి శరీరంలోకి ప్రవేశిస్తుంది. అలాగే అవయవ మార్పిడి జరిగిన వారిలో, ఐసీయూలో చికిత్స పొందిన వారిలో కూడా ఇది సోకే ముప్పు ఎక్కువ.

లక్షణాలు ఎలా గుర్తించాలి..?
ఇప్పటి వరకు వచ్చిన నివేదికల ప్రకారం.. ఇది సోకిన వారిలో దాదాపు సగం మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది సోకిన వారిలో మూడోవంతు మంది చూపు కోల్పోతున్నారు. ఈ ఫంగస్ బారిన పడిన వెంటనే ముక్కుపై ప్రభావం కనపడుతుంది. ముక్కు దిబ్బడ మొదలవుతోంది. ఆ తర్వాత నెమ్మదిగా ముఖం వాపు, కళ్ల వాపు వంటి లక్షణాలు బయటపడతాయి. అలాగే ముక్కు కింది భాగంలో నల్లటి మచ్చలు కనిపిస్తాయి. ఈ ఫంగి ఊపిరితిత్తుల్లోకి చేరగానే ఛాతిలో నొప్పి, ఊపిరి ఆడకపోవడం, దగ్గు వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. దీనిని అశ్రద్ధ చేస్తే చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. అప్పటికీ పట్టించుకోకపోతే ప్రాణాలే కోల్పోవచ్చు. దీనిపై ఢిల్లీలోని ఆస్పత్రి ఈఎన్‌టీ విభాగం ఛైర్మన్‌ అజయ్‌ స్వరూప్‌ మాట్లాడుతూ.. తీవ్రమైన డయాబెటిక్‌ సమస్య, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిలో ఈ ఫంగస్ దాడి ఎక్కువగా ఉంటుందని తెలిపారు.

చికిత్స ఎలా..?
ఈ సమస్య బయటపడగానే బాధితుడు ఆసుపత్రికి వెళితే వైద్యులు బయాప్సీ పరీక్షలు నిర్వహించి నిర్ధారిస్తారు. అదే దీనిపై అమెరికాకు చెందిన సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ పలు సూచనలు చేసింది. ఈ ఫంగస్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదని పేర్కొంది. కానీ, దీనిని ముందుగానే గుర్తించి యాంటీ ఫంగల్‌ వైద్యం అందిస్తే బాధితుల ప్రాణాలు కాపాడే అవకాశం ఉందని వెల్లడించింది. సమస్య తీవ్రంగా ఉన్నవారిలో యాఫోటెరిసన్‌ బీ వంటి యాంటీ ఫంగల్‌ ఇంజెక్షన్లను ఇవ్వడం ద్వారా ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం పుణెలోని ఆసుపత్రుల్లో ఈ ఔషధానికి విపరీతంగా డిమాండ్‌ ఉంది. అక్కడ రోజూ దాదాపు 1000 వయల్స్‌ వరకు వాడుతున్నారు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x