టీమిండియా యువ ఆల్‌రౌండర్లలో ప్రస్తుతం హార్దిక్ పాండ్యా టాప్ ప్లేస్‌లో ఉంటాడు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ రెండు విభాగాల్లో సూపర్‌గా రాణిస్తూ జట్టులో కీలక ఆటగాడిగా నిలుస్తుంటాడు. అయితే కొంత కాలంగా అతడు కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్‌కే పరిమితమైపోయాడు. అందులోనూ బౌలింగ్‌కు పూర్తిగా దూరమైపోయాడు. దీంతో అతడు బ్యాటింగ్‌లో రాణిస్తున్నా.. బౌలింగ్‌లో మాత్రం అతడి స్టామినా మరుగున పడిపోయింది. తాజాగా ఇంగ్లండ్‌తో జరగబోతున్న టెస్ట్ సిరీస్‌కు కూడా హార్దిక్ ఎంపిక కాలేదు. ఈ సమయంలోనే హార్దిక్ గురించి కామెంటేటర్ ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు చేశాడు.
తాజాగా బీసీసీఐ ఇంగ్లండ్ వెళ్లబోతున్న టీమిండియా జట్టును ప్రకటించింది. ఆగస్టు నెలలో ప్రారంభం కాబోతున్న ఈ సిరీస్ కోసం మరో రెండు వారాల్లో టీమిండియా జట్టు ఇంగ్లండ్ బయలుదేరనుంది. అయితే ఈ సిరీస్ ముందు జులైలో కివీస్‌తో జరగనున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్‌లో కూడా టీమిండియా తలపడనుంది. ఈ టోర్నీల కోసం ఇంగ్లండ్ వెళ్లబోయే జట్టు సభ్యుల పేర్లను బీసీసీఐ తాజాగా ప్రకటించింది. అందులో హార్దిక్ పేరు లేదు. దీంతో ఇకపై హార్దిక్‌ను టెస్ట్ మ్యాచ్‌ల్లో చూడడం కష్టమేనని ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ వంటి దేశాల్లోనే హార్దిక్ అవసరం ఎక్కువగా ఉంటుందని, అలాంటిది ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు హార్దిక్‌ను ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యం కలిగించిందని అన్నాడు. దీనిని బట్టి చూస్తే హర్దిక్‌ను సుదీర్ఘ ఫార్మాట్‌కు తీసుకోవడానికి బీసీసీఐ ఇష్టంగా లేనట్లు తెలుస్తోందని అన్నాడు.
`ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాల్లోనే హార్దిక్ సేవలు ఎక్కువ అవసరం. అయితే గాయాలు అతణ్ని ఇబ్బంది పెడుతున్నాయి. వెన్నెముక గాయం తర్వాత శస్త్ర చికిత్స చేయించుకుని ఏడాది పాటు క్రికెట్‌కు దూరమయ్యాడు. అనంతరం జట్టులోకి వచ్చినా బౌలింగ్ చేయడం లేదు. అందుకే హార్దిక్‌ను సెలెక్టర్లు సుదీర్ఘ ఫార్మాట్‌కు పరిగణనలోకి తీసుకోవడం లేద`ని ఆకాష్ చోప్రా పేర్కొన్నాడు.
కాగా.. ఇంగ్లండ్ పర్యటన సమయంలోనే శ్రీలంక పర్యటన కూడా ఉండడనున్నందున బీసీసీఐ ఈ సారి రెండు భారత జట్లను బరిలోకి దించనుంది. మొదటి జట్టు కోహ్లీ సారథ్యంలో ఇంగ్లండ్ వెళ్లనుండగా, రెండో జట్టు టీ20లు, వన్డేలు ఆడేందుకు శ్రీలంక వెళ్లనుంది. ఇందులో హార్దిక్‌కు చోటు దక్కే అవకాశం ఉంది.