రాష్ట్ర సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చుతూ.. పేద, మధ్యతరగతి ప్రజలపై భారం మోపేలా తాజా బడ్జెట్ ఉందని ఆరోపించారు. అసెంబ్లీ సాక్షిగా ప్రజలను తప్పుదారి పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో టీడీపీ నిర్వహించిన మాక్ అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడారు. ప్రభుత్వానికి అప్పులపై ఉన్న శ్రద్ధ రాష్ట్రాభివృద్ధిపై లేదని, అసెంబ్లీలో 2019 కాగ్ రిపోర్ట్ ప్రవేశపెట్టడం ప్రభుత్వ దివాలాకోరుతనానికి నిదర్శనమని మండిపడ్డారు.
అంకెల గారీడీ, అబద్ధాలతో ప్రజలను మరోసారి ప్రభుత్వం వంచించిందని, రాష్ట్రాభివృద్ధికి ఈ బడ్జెట్ ఏ విధంగానూ ఉపయోగపడదని అన్నారు. రాష్ట్రంలో పూర్తిస్థాయి వ్యాక్సినేషన్‌కు రూ.1600 కోట్లు అవసరం కాగా, కేవలం రూ.500 కోట్లు మాత్రమే కేటాయించడం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటం కాదా? అంటూ సర్కార్‌ను నిలదీశారు. ప్రస్తుతం రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిపోతోందని, పారిశ్రామిక వృద్ధి రేటు -3.26, సేవారంగ వృద్ధి రేటు -6.71కు పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
రూ.50,940 కోట్లతో ఇళ్లు నిర్మిస్తామని చెప్పి బడ్జెట్‌లో కేవలం రూ.5,661 కోట్లు మాత్రమే కేటాయిచారని, ఇది ప్రజలను మోసగించడమేనని చెప్పారు. ‘ఆదాయ, వ్యయాల లెక్కలన్నీ తప్పుల తడక, అంకెల గారడీ. నీటిపారుదల రంగానికి గత ఏడాది రూ.11,800 కోట్లు కేటాయించి సగం కూడా ఖర్చు పెట్టలేదు. రాష్ట్రంలో 56 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటుచేసినట్లు గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం ఆ కార్పొరేషన్లకు ఒక్క రూపాయి నిధులు కూడా కేటాయించలేదం’టూ నిప్పులు చెరిగారు.
కాగా.. మొత్తం రాష్ట్ర ఆదాయంలో అప్పులు 36.46 శాతంగా ఉందని, దేశం మొత్తమ్మీద ఇదే అత్యధికమని ఆయన అన్నారు. రెవెన్యూ రాబడులు గతేడాది బడ్జెట్‌లో రూ.1.61వేల కోట్లు చూపగా.. నిజానికి రూ.1.18లక్షల కోట్లు మాత్రమే వచ్చాయని, దీనిని బట్టి చేస్తే రాష్ట్రం అప్పుల ఊడిలో కూరుకుపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు.