ఐపీఎల్ 2021 కోసం సౌత్‌ఆఫ్రికా స్టార్ బ్యాట్స్‌మన్ డివిలియర్స్ ప్రాక్టీస్ మొదలుపెట్టేశారు. ఈ క్రమంలోనే శుక్రవారం తన ప్రాక్టీస్‌కు సంబంధించి ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశాడు. అయితే ఈ వీడియోలో అతడి ప్రాక్టీస్ గురించి కాకుండా తన ఐఫోన్ గురించి చెప్పాడు. ఎందుకంటే ప్రాక్టీస్ చేస్తూ తన ఐఫోన్‌ను డివిలియర్స్ పగలగొట్టుకున్నాడు. ఎదురుగా ఫోన్‌ను ఉంచిన డివిలియర్స్.. ఓ చక్కటి స్ట్రెయిట్ డ్రైవ్ ఆడాడు. అయితే ఆ బంతి నేరుగా ఫోన్‌ను తాకింది. దీంతో ఆ ఫోన్ పగిలిపోయింది. ఈ వీడియోను షేర్ చేసిన ఏబీ.. `ఐఫోన్ అవుట్. క్రికెట్ గురు బెన్నీతో కలిసి ఐపీల్ ప్రాక్టీస్` అని రాసుకొచ్చాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఏబీ డివిలియర్స్ ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడుతున్న విషయం తెలిసిందే. వచ్చే నెల 9వ తేదీన చెన్నై వేదికగా ఐపీఎల్-14 ప్రారంభం కాబోతోంది. ప్రారంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు తలపడబోతోంది. ఈ మ్యాచ్‌లో గెలిచి ఎలాగైనా శుబారంభం చేయాలని పట్టుదలగా ఉంది. అంతేకాదు ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఒక్కసారి కూడా కప్పు గెలవని బెంగళూరు ఈ సారి ఎలాగైనా ఛాంపియన్ కావాలని అనుకుంటోంది.
De Villiers broke his iphone pic.twitter.com/PV1Hmec0CD
— Karthikeya Pochiraju (@karthik26688) March 12, 2021
ఇదిలా ఉంటే ఐపీఎల్ 2021 కోసం ఆటగాళ్లంతా ప్రాక్టీస్ మొదలుపెట్టేశారు. మెగా టోర్నీలో ఎలాగైనా సత్తా చాటాలని చెమటోడుస్తున్నారు. స్టార్ బ్యాట్స్‌మెన్, బౌలర్ల నుంచి యువ ఆటగాళ్ల వరకు అంతా ఇప్పుడు ప్రాక్టీస్ పిచ్‌లలోనే కనిపిస్తున్నారు. ముఖ్యంగా విదేశీ ఆటగాళ్లయితే మరింత కష్టపడి ప్రాక్టీస్ చేస్తున్నారు.