కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రతి రోజూ లక్షల కేసులు కొత్తగా నమోదవుతున్నాయి. వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆసుపత్రుల్లో బెడ్లు లభించకపోవడం, ఆక్సిజన్ కొరత, మెడిసిన్ అందకపోవడం వంటి కారణాలతో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ విషయంపై యోగా గురు రాందేవ్ బాబా ఇటీవల మాట్లాడుతూ.. అల్లోపతి(ఆధునిక ఇంగ్లీషు వైద్య విధానం) విఫలమైందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. అల్లోపతి చెత్త వైద్యం అని, ఆ వైద్య విధానం పనిచేయకపోవడం వల్లనే ఇన్ని లక్షల ప్రాణాలు పోతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాందేవ్ కామెంట్స్‌పై శనివారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలను తప్పుదోవ పట్టించేలా రాందేవ్ బాబా మాటలు ఉన్నాయని, ఆయనపై వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ప్రతి రోజూ ఎన్నో లక్షల మంది డాక్టర్లు తమ ప్రాణాలకు తెగించి మరీ కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు ప్రయత్నిస్తున్నారని, వారందరి శ్రమను రాందేవ్ చాలా చులకనగా మాట్లాడారని, ఇది క్షమార్హం కాదని పేర్కొంది.
ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) రాందేవ్ బాబాకు వ్యతిరేకంగా ఓ పత్రికా ప్రకటనను సైతం విడుదల చేసింది. ఆ ప్రకటనలో.. ‘యోగా గురు రామ్‌దేవ్ బాబా అల్లోపతి మందులను పనికి రాని వాటిగా చిత్రీకరిస్తున్నారు. గతంలోనూ ఆయన డాక్టర్లపై ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలే చేశారు. వండర్ డ్రగ్స్ విడుదల సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ముందే డాక్టర్లను హంతకులన్నారు.
రామ్‌దేవ్, ఆయన సహచరుడు బాలకృష్ణా జీలు అనారోగ్యం పాలైనప్పుడు అల్లోపతి వైద్యమే చేయించుకుంటున్నారు. తప్పుడు, నిరాధార ఆరోపణలు, ప్రకటనలు చేస్తూ జనాల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. అందువల్ల ఆయనపై ‘‘ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్’’ కింద ఆయనపై చర్యలు తీసుకోవాలి. విచారణకు ఆదేశించాల’ని కేంద్ర ఆరోగ్య శాఖను ఐఎంఏ డిమాండ్ చేసింది.