టీఆర్ఎస్ మాజీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరి తన వ్యక్తిత్వాన్ని కోల్పోయాని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌లో చేరాలా వద్దా అనేది ఈటల ఇష్టమని, కానీ లౌకికవాదినని చెప్పుకునే ఈటల ఇప్పుడు బీజేపీలో చేరడం మాత్రం ఆయన వ్యక్తిత్వ లోపాన్ని చూపుతోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈటల ఒకవేళ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమైనా.. ఆయన గెలిచేవారని, ప్రజల్లో మంచి పేరు కూడా ఉండేదని, కానీ బీజేపీలో చేరి ఆయన స్థాయిని దిగజార్చుకున్నారని జీవన్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘ఈటల ఇండిపెండెంట్‌గా ఎన్నికల్లో నిలబడితే 50 వేల ఓట్లతో గెలిచేవారు. కానీ బీజేపీలో ఆయన చేతులు కలపడం ఆయన విధానాలకే వ్యతిరేకం’ అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
అలాగే టీఆర్ఎస్ అవినీతికి బీజేపీ రక్షణగా నిలుస్తోందని, అవినీతి చేసిన టీఆర్ఎస్ నేతలను ఎప్పుడు జైల్లో పెడతారో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తప్పుల మీద తప్పులు చేస్తున్న టీఆర్ఎస్ పార్టీని బీజేపీ ఏమీ చేయడం లేదని, కేంద్ర స్థాయిలో రెండు పార్టీలు కలిసే అవినీతికి పాల్పడుతున్నాయని, మరి ఈ విషయం బండి సంజయ్‌కు తెలుసో లేదోనని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
అనంతరం ఉపాధి హామీ కూలీల సమస్యలపై మండిపడ్డారు. ఉపాధి హామీ కూలీలకు 2 నెలల నుంచి డబ్బులు చెల్లించడంలేదని, ఉపాధి హామీ పథకంలోని ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం తొలగించిన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు 90 శాతం మంది దళితులే, వారిని తొలగించడం మానవత్వం లేని చర్య అని అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడిన జీవన్‌రెడ్డి.. వెంటనే ఉపాధి హామీ కూలీలను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు.