Friday, November 1, 2024

దివికేగిన దిగ్గజ శిఖరం.. ఫ్లయింగ్ సిఖ్ మిల్కాసింగ్ మృతి

దిగ్గజ పరుగుల వీరుడు సెలవు తీసుకున్నాడు. ఫ్లయింగ్‌ సిఖ్‌ దివికేగాడు. అవును.. దిగ్గజ మాజీ ఆథ్లెట్ మిల్కా సింగ్‌ (91) కన్నుమూశారు. కరోనా అనంతర సమస్యలతో మిల్కా సింగ్ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (పీజీఐఎంఈఆర్‌)లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే శుక్రవారం అర్ధరాత్రి 11.30 గంటల సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారు.

ఇంటి వంట మనుషుల్లో ఒకరు కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆ వ్యక్తి ద్వారా మే 20వ తేదీన మిల్కాసింగ్‌కు వైరస్‌ సోకింది. మే 24న మొహాలీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. నెగెటివ్‌ రావడంతో మే 30న డిశ్చార్జి అయ్యారు. అయితే ఆక్సిజన్‌ స్థాయిలు పడిపోవడంతో జూన్‌ 3న కుటుంబ సభ్యులు ఆయనను మళ్లీ చండీగఢ్‌లోని పీజీఐఎంఈఆర్‌లో చేర్పించారు. అక్కడే 16 రోజులుగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు.

మిల్కాసింగ్ మృతి పట్ల దేశం మొత్తం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. ట్విట్టర్ వేదికగా మిల్కా మృతికి సంతాపం తెలిపారు. మిల్కా సింగ్ మరణంతో ఓ గొప్ప క్రీకాశిఖరాన్ని దేశం కోల్పోయిందని, ఆయనకు దేశం గుండెల్లో ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుందని మోడీ తన ట్వీట్ లో రాసుకొచ్చారు. ఇక మిల్కా సింగ్ మరణ వార్త తీవ్రంగా బాధించిందని, ఆయనను భారత జాతి ఎన్నటికీ మర్చిపోదని పేర్కొన్నారు. అంతే కాకుండా ఆయన కుటుంబానికి తన సానుభూతి తెలియజేశారు.


మిల్కా సింగ్ జీవితం సాగిందిలా..
1932 నవంబర్‌ 20న పాకిస్తాన్‌లోని పంజాబ్‌లో ఉన్న గోవింద్‌పురలో జన్మించారు. సిక్‌రాథోడ్‌ రాజపుత్రుల కుటుంబంలో జన్మించిన మిల్కాసింగ్‌ 1951లో భారత సైన్యంలో చేరారు. ఆర్మీ నిర్వహించిన పరుగులపోటీలో మిల్కాసింగ్‌కు ఆరో స్థానంలో నిలిచారు. అనంతరం అథ్లెట్‌గా మారారు. మిల్కాసింగ్‌కు హైదరాబాద్‌తో విడదీయరాని అనుబంధం ఉంది. సికింద్రాబాద్‌లో మిల్కాసింగ్‌ 9 ఏళ్లపాటు శిక్షణ పొందారు. అనంతరం 1958 కామన్వెల్త్‌ గేమ్స్‌లో స్వర్ణం గెలిచి సత్తా చాటాడు. అనంతరం1958 టోక్యో, 1962 జకార్తా ఆసియా క్రీడల్లో నాలుగు స్వర్ణాలు నెగ్గారు. 1960 రోమ్‌ ఒలింపిక్స్‌లో 400 మీటర్ల విభాగంలో నాలుగో స్థానంలో నిలిచారు. త్రుటిలో ఒలింపిక్‌ పతకాన్ని కోల్పోయారు. ట్రాక్‌పై ఆయన చూపిన తెగువతో అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.


కేంద్ర ప్రభుత్వం ఆయన్ను 1959లో పద్మశ్రీతో సత్కరించింది. మిల్కాసింగ్‌ భార్య నిర్మల్‌ కౌర్‌ కరోనా వైరస్‌తో పోరాడుతూ జూన్‌ 14వ తేదీన మృతి చెందిన విషయం తెలిసిందే. భార్య మృతి చెందిన నాలుగు రోజులకే ఆయన కన్నుమూయడంతో మిల్కాసింగ్‌ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

చివరిగా మిల్కాసింగ్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకొని ‘భాగ్‌ మిల్కా భాగ్‌’ అనే బాలీవుడ్‌ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం అద్భుత విజయం సాధించి కలెక్షన్ల వర్షం కురిపించింది.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

3,894FansLike
3,576FollowersFollow
3,976FollowersFollow
2,480FollowersFollow
1,267FollowersFollow
7,784SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x